
రాష్ట్రంలో 25% లోటు వర్షపాతం ఉన్నా 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు
ఈ సీజన్‌లో సాగు లక్ష్యాన్ని 1.32 కోట్ల ఎకరాలుగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ
అందుకు అనుగుణంగానే వివిధ పంటలను సాగు చేస్తున్న రైతాంగం
ఇప్పటికే 45 లక్షల ఎకరాల్లో పత్తి, సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు
సుమారు 14 లక్షల ఎకరాల్లో సాగవుతున్న మొక్కజొన్న, కంది, సోయాబీన్
నెలాఖరుకు మరో 30 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ సీజన్‌లో కోటి ఎకరాలకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. మున్ముందు వరుణుడు కరుణిస్తాడన్న నమ్మకంతో వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగానే రైతాంగం వివిధ పంటలను సాగు చేస్తోంది. వానాకాలం సీజన్‌లో నీరు తక్కువ అవసరమైన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది పంటలను ఇప్పటికే భారీగా సాగు చేసిన రైతులు.. వరిని ఆచితూచి సాగు చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే నాట్లు పడాల్సిన పల్లెల్లో కొంత ఆలస్యమైంది. ఆరు జిల్లాల్లోని 170 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నెలకొని ఉండటం గమనార్హం. అయితే ఆగస్టు మూడో వారం దాటితే వరిసాగుకు గడువు ముగుస్తుందనే కారణంతోపాటు సెపె్టంబర్ దాకా వర్షాలు కురిసి గోదావరి నిండుతుందన్న నమ్మకంతో రైతులు పొలాల బాట పడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 25 శాతం వరకు లోటు వర్షపాతం ఉన్నప్పటికీ వానాకాలం సీజన్ పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. వ్యవసాయ శాఖ ఈ సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా ఇప్పటికే 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి సాగు విస్తీర్ణం సుమారు 32 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ నెలాఖరు వరకు మరో 30 లక్షల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో ఆశాజనకం
గోదావరి పరీవాహిక ప్రాంతంలో సాగునీరు లేక వరిసాగు అంతంత మాత్రంగా ఉండగా కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో మాత్రం ఇప్పుడిప్పుడే రైతులు నాట్లు వేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు కూడా దక్షిణ తెలంగాణ రైతులకు ఆశాజనకంగా మారాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే సగటున 40 శాతం వరిసాగు కాగా పత్తి 70–80 శాతం సాగైంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే పత్తి 80 శాతానికిపైగా సాగవగా వరి 30–40 శాతం వరకు సాగులో ఉంది. రంగారెడ్డి పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసినప్పటికీ వరిసాగు విస్తీర్ణం అంతంత మాత్రంగానే ఉంది.
కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతోపాటు దక్షిణ తెలంగాణలో వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో కృష్ణా నది పరిధిలోని 30 జలాశయాల్లో 619 టీఎంసీల నీటికిగాను 577 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.
ఆగస్టు మూడో వారం వరకు దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జల్లాలతోపాటు ఉత్తర తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కూడా వరిసాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ చెబుతోంది.
ఎస్సారెస్పీ నీటి విడుదలతో..
ఉత్తర తెలంగాణ జిల్లాలకు గోదావరి జలాలే ప్రధాన నీటివనరు. మొత్తంగా గోదావరి పరిధిలో 419 టీఎంసీల సామర్థ్యంగల 57 జలాశయాలు ఉండగా వాటిలో ఇప్పుడున్న నీటి నిల్వలు కేవలం 146 టీఎంసీలే. అయితే నిజామాబాద్‌తోపాటు పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, హనుమకొండతోపాటు నిర్మల్, మంచిర్యాలకు నీరందించే ఎస్సారెస్పీ కుడి, ఎడమ కాల్వలకు ఇటీవల నీటిని విడుదల చేయడంతో ఆయా జిల్లాల పరిధిలో రైతులు కాల్వల కింద ఉన్న పొలాల్లో నాట్లు వేసుకుంటున్నారు.
నిజామాబాద్, జిల్లాలో లోటు వర్షపాతం ఉన్నప్పటికీ సెపె్టంబర్‌లో వానలు కురిసి ప్రాజెక్టులు నిండుతాయనే ఆశతోపాటు ఎస్సారెస్పీ నీటి విడుదలతో సాధారణ సాగు విస్తీర్ణంలో 90 శాతానికిపైగా నాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలో ఇటీవల కురిసిన వర్షాలకు తోడు జలాశయాల నుంచి వచ్చిన నీటితో రైతులు సాగు పనుల్లో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లాల్లోనూ 60–70 శాతం పంటలను సాగు చేశారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంకన్నా సుమారు 60 శాతం తక్కువగా సాగు నమోదైంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు 43 వేల ఎకరాల్లో పంటలు సాగు కావల్సి ఉండగా 4,500 ఎకరాలకే పరిమితమయ్యాయి. ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోనూ మూడో వంతు విస్తీర్ణంలో కూడా నాట్లు వేయలేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరిసాగు విస్తీర్ణం ఈసారి ఆశాజనకంగా ఉంది.
పూర్తిస్థాయిలో పత్తి, మొక్కజొన్న
రాష్ట్రంలో వర్షాకాల పంటల్లో కీలకమైన పత్తి, మొక్కజొన్న వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా సాగయ్యాయి. ఈ సంవత్సరం పత్తి 48.93 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేయగా ఇప్పటివరకు 45 లక్షల ఎకరాల్లో సాగైంది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 5.55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవ్వగా, ఆ తర్వాతి స్థానంలో 4.3 లక్షల ఎకరాలతో ఆదిలాబాద్ ఉంది.
ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగైంది. మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాల సాధారణ సాగును దాటి 5.55 లక్షల ఎకరాల్లో సాగయింది. కంది 4.44 లక్షల ఎకరాల్లో సాగవగా సోయాబీన్‌ను 3.57 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు.