- ఏఐ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ..
- ఇందుకు నిదర్శనంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్..
- రచయితలుగా, పాఠకులుగా యువ ప్రాతినిథ్యం ప్రధాన కారణం..
- సమకాలీన అంశాల రచనలకు పట్టం కడుతున్నీ తరం..
హైదరాబాద్ నగరం మరోసారి తన సాహిత్య ప్రేమను చాటుకుంది. నగరం వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 38వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. అయితే ఈ పుస్తకాల పండుగ ముగిసినా, పాఠకుల మనసుల్లో మాత్రం దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతీ ఏడాది తన ప్రశస్తిని, ప్రాధాన్యతను మరింత పెంచుకుంటూ వస్తున్న ఈ బుక్ ఫెయిర్… ఈ సారి మాత్రం ఈ తరం రచయితలు, యువ పాఠకుల ఉత్సాహంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిజిటల్ రీల్స్, షార్ట్ వీడియోలు, ఏఐ కంటెంట్‌తో నిండిపోయిన ఈ కాలంలోనూ భౌతికంగా పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చదవాలనే ఆసక్తి తగ్గలేదని ఈ బుక్ ఫెయిర్ మరోసారి నిరూపించింది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, యంగ్ ప్రొఫెషనల్స్, క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్న యువత పెద్ద సంఖ్యలో బుక్ ఫెయిర్‌ను సందర్శించారు. పుస్తకాలను కొనడమే కాకుండా, రచయితలతో నేరుగా మాట్లాడటం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం, కొత్త రచనలపై చర్చించడం వంటి అంశాలు బుక్ ఫెయిర్‌ను ఒక లైఫ్‌స్టైల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చాయి.

ఈ తరం రచయితలు కూడా పాఠకుల అభిరుచులను బాగా అర్థం చేసుకుంటున్నారు. సమకాలీన జీవితానికి దగ్గరగా ఉండే కథలు, నిజ జీవిత అనుభవాల నుంచి పుట్టిన రచనలు, భావోద్వేగాలను స్పృశించే నరేటివ్స్ ఈ సారి ఎక్కువగా కనిపించాయి. ప్రేమ, ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్, సామాజిక స్థితిగతులు, యువత ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, కెరీర్ డైలమాస్ వంటి అంశాలు రచనలకు కేంద్రబిందువుగా మారాయి. పాఠకులు కూడా ఇలాంటి ఆర్గానిక్, రియల్ లైఫ్ టచ్ ఉన్న పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో ట్రావెల్, సినిమా, కల్చర్, ఫుడ్, వ్యక్తిత్వ వికాసం వంటి లైఫ్‌స్టైల్ అంశాలకు చెందిన పుస్తకాలు కూడా మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా ట్రావెల్ బుక్స్ విషయంలో యువత ప్రత్యేక ఆసక్తి చూపించింది. కొత్త ప్రదేశాలు, అనుభవాలు, లోకల్ కల్చర్‌ను పరిచయం చేసే రచనలు ఈ తరం ఆలోచనలకు అద్దం పట్టాయి. సినిమా రంగానికి సంబంధించిన కథనాలు, స్క్రీన్‌రైటింగ్, సినిమా అనాలిసిస్ వంటి పుస్తకాలు కూడా సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.

ఈ బుక్ ఫెయిర్‌లో మరో ముఖ్యమైన విశేషం… మహిళా రచనల సంఖ్య గణనీయంగా పెరగడం. మహిళల జీవితానుభవాలు, వారి భావోద్వేగాలు, సామాజిక పోరాటాలు, స్వతంత్ర ఆలోచనలు ప్రతిబింబించే పుస్తకాలు పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. ఇది తెలుగు సాహిత్యంలో మారుతున్న దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. మహిళా రచయితలు కేవలం ఒక జానర్‌కే పరిమితం కాకుండా, కథలు, నవలలు, కవిత్వం, లైఫ్‌స్టైల్ రైటింగ్స్‌లోనూ తమ ప్రత్యేక ముద్ర వేశారు.

పబ్లిషింగ్ హౌసెస్ కూడా అధునాతన మార్పును గమనించాయి. యువతకు నచ్చే కవర్ డిజైన్స్, ఈజీ లాంగ్వేజ్, రీడర్ ఫ్రెండ్లీ ప్రెజెంటేషన్‌తో పుస్తకాలను అచ్చు వేస్తూ, కొత్త రచయితలకు అవకాశాలు కల్పించడం ఈ సారి స్పష్టంగా కనిపించింది. స్వయంగా పబ్లిషర్స్‌గా మారిన యువ రచయితలు కూడా తమ రచనలను పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి, 38వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఈ తరం ఆలోచనలకు, అభిరుచులకు, లైఫ్‌స్టైల్‌కు అద్దం పట్టిన వేదికగా నిలిచింది. పుస్తకం అంటే కేవలం చదవడమే కాదు… అది ఒక అనుభవం, ఒక జీవనశైలి అన్న భావనను ఈ బుక్ ఫెయిర్ మరోసారి బలంగా చెప్పింది.

పుస్తకాలు., మనుషులు., సమాజం.
బుక్ ఫెయిర్ అంటే మాలాంటి రచయితలు, పాఠకులకు పండుగ. పుస్తకాలను ప్రేమించేవారు మనుషులను ప్రేమిస్తారు.., మనుషులను ప్రేమించే వారు సామజాన్ని ప్రేమిస్తారు. ఇలా సాహిత్యం వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా పరిపూర్ణత్వాన్ని, విఙ్ఞానాన్ని, వికాసాన్ని అందిస్తుంది. ఈ సారి బుక్ ఫెయిర్‌లో నా కొత్త పుస్తకం ‘యుద్ద కాలపు శోక గీతం’ కూడా అందుబాటులో ఉంది. నా ఈ ధీర్ఘ కవితకు ఈ తరం పాఠకుల నుంచి మంచి స్పందన రావడం నా బాధ్యతను మరింత పెంచింది అనిపించింది. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యేవారు బుక్ ఫెయిర్‌లో గుర్తు పట్టి మరీ నా బుక్ కొనడం నా సాహిత్య ప్రయాణం ప్రాధాన్యతను మరొక్కసారి గుర్తు చేసింది. మనిషిని మనిషిలా చూడలేని సమాజాన్ని ప్రశ్నించడం నాకు ఇష్టం.. ఇలాంటి రచనలను సైతం ఈ తరం యువత ఆసక్తిగా చదవడం ధృఢమైన భవిష్యత్‌కు నాందిలా భావిస్తున్నాను.
-మెర్సీ మార్గరేట్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత.

రచయితల ఆలోచనలు తెలసుకోవచ్చు.,
మాలాంటి యువతకు సమాజ దృక్కోణాన్ని మరింత పాజిటీవ్‌గా, భాధ్యతాయుతంగా చూపించడం కోసమే బుక్ ఫెయిర్ ఇంకా కొనసాగుతోందని అనిపిస్తుంది. నాకు రచనలు చేయడం ఇష్టం, అంతకు మించి చదవడం ఇష్టం. వీటి పైన ఉన్న ఆసక్తితో బుక్ ఫెయిర్‌కు సంబంధించిన పనుల్లో ఒక వాలంటీర్‌గా, నిర్వహణకు నా వంతు సహాయాన్ని అందించే యువకుడిగా ఉన్నాను. బుక్స్ లైబ్రరీల్లో, ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి.. కానీ అవి రాసే రచయితలను వ్యక్తిగతంగా కలుసుకుని వారి ఆలోచనా విధానాన్ని మరింత తెలసుకోవడానికి ఈ బుక్ ఫెయిర్ మంచి వేదిక.
- పేర్ల రాము, యువ సాహితీ ప్రేమికుడు.

క్లాసిక్స్‌కూ మంచి ఆదరణ..,
ప్రతీ ఏడాది బుక్ ఫెయిర్ ఇస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని కొత్త పుస్తకాలను తీసుకొస్తున్నాం. యువ రచయితల కొత్త పుస్తకాలతో పాటు ఆ నాటి తరం క్లాసిక్ రచనలను అమృతం కురిసిన రాత్రి, మహాప్రస్తానం, అమరావతి కథలు, బారీష్టర్ పార్వతీశం వంటి పుస్తకాల అమ్మకాలు ప్రస్తుత బుక్ ఫెయిర్‌లో పెరుగుతున్నాయి. మా పబ్లిసింగ్ హౌస్ నుంచి దేశీయంగానే కాకుండా ఇతర దేశాల్లోని వివిధ భాషల్లోని అత్యుత్తమ నవలలు, కథలు ఇతర రచనలను ప్రచురిస్తున్నాం. అయితే ఈ బుక్ ఫెయిర్ మాత్రమే కాకుండా తమిళనాడు తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో లైబ్రరీల సంరక్షణ, పెంపుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. -అరునాంక్ లత, ఛాయ పబ్లిషర్స్ సీఈఓ.
ప్రతీ ఏడాది బుక్ ఫెయిర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను. నాలాంటి ఎంతో మంది బుక్ రీడర్స్‌కు అంతలా మమేకం అయిపోయింది ఈ బుక్ ఫెయిర్. పుస్తకాలు కొనడమే కాదు బుక్ లవర్స్ కమ్యూనిటీ అంతా ఒకే వేదికగా కలుసుకునే అద్భుత అవకాశాన్ని ఈ బుక్ ఫెయిర్ అందిస్తుంది. గత రెండు మూడేళ్లుగా అధునిక రచనలతో యువత రాస్తున్న సమకాలీన రచనలు పుస్తకాలను మరింత కాలం ముందుకు తీసుకెళుతున్నాయి.
-కావలి చంద్రకాంత్, యువ పాఠకుడు.


