
యూరియా సరఫరాలో రేషన్ విధానం
ఆధార్‌కార్డు, భూమి పాస్‌బుక్ ఆధారంగా పంపిణీ
యూరియా కేటాయింపులో కోత పెట్టిన కేంద్రం
నాలుగు నెలల్లో 2.37 లక్షల టన్నుల కోత
ఈ నెలలో కూడా 44 వేల మెట్రిక్ టన్నులు కట్
యూరియా కోసం కేంద్రానికి మంత్రి తుమ్మల మరో లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎంతో విరామం తర్వాత కురుస్తున్న వర్షాలను చూసి వ్యవసాయ పనులను వేగవంతం చేయాలని ఆశపడిన రైతులను యూరియా కొరత తీవ్ర నిరాశలోకి నెడుతోంది. యూరియాను రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్)లలో అందుబాటులో ఉంచినప్పటికీ, రైతులకు రేషన్ విధానంలో సరఫరా చేస్తున్నారు. ఆధార్ కార్డు, భూమి పట్టా పాస్ పుస్తకాలను బట్టి ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సొంత జిల్లా ఖమ్మంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌తో లింకై ఉన్న ఫోన్ నంబర్‌కు ఓటీపీ పంపి నిర్ధారణ చేసుకొని మరీ యూరియా అందజేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చింది వచ్చినట్లు సరఫరా..
కేంద్ర ప్రభుత్వం వానాకాలం కోసం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. ఇందులో ఏప్రిల్ నుంచి జూలై వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావలసి ఉండగా, ఇప్పటివరకు 4.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. అంటే 36 శాతం లోటు ఉంది. ఈ నేపథ్యంలో గోదాములకు వచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు ఊడ్చినట్లు అయిపోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ స్టాక్ ప్రస్తుత నెల వరకు కష్టంగా సరిపోయే అవకాశం ఉంది.
ఆగస్టులో అత్యధికంగా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ చెబుతోంది. జూలై కోటాలో లోటుగా ఉన్న 44 వేల మెట్రిక్ టన్నులతోపాటు ఆగస్టులో రావలసిన 1.20 లక్షల మెట్రిక్ టన్నులను వెంటనే విడుదల చేస్తే ఇప్పుడున్న స్టాక్‌తో బొటాబొటిగా సరిపుచ్చుకునే అవకాశం ఉంది. లేదంటే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కోసం శనివారం మరోసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు.
ఎంత పొలం ఉన్నా రెండు బస్తాలే
ఖమ్మం జిల్లాకు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉండగా 4,500 మెట్రిక్ టన్నులే అందించారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నా రెండు బస్తాలే ఇస్తున్నారు. ఒక ఎకరం ఉంటే ఒక బస్తానే ఇస్తున్నారు. అది కూడా రైతు ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెపితేనే ఇస్తున్నారు. దీనికోసం రైతులు పొలాలు వదిలి క్యూ లైన్‌లో నిలబెడుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.
– బొంతు రాంబాబు, రైతు సంఘం నాయకుడు
యూరియా లభ్యతను బట్టి రైతులకు పంపిణీ
సొసైటీకి వచ్చే యూరియా లోడ్‌ను బట్టి రైతులకు సరఫరా చేస్తున్నాం. ఆధార్ కార్డు ఆధారంగా ఒక రైతుకు రెండు బస్తాల చొప్పున పంట కాలంలో మూడు సార్లు ఇస్తాం. రైతుకు రెండు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే ఉన్న స్టాక్ ఆధారంగా పంపిణీ చేస్తున్నాం. రైతులు అర్థం చేసుకుంటున్నారు.
– జూపల్లి సందీప్‌రావు, పీఏసీఎస్ చైర్మన్, గర్రెపల్లి, పెద్దపల్లి జిల్లా