ఆటోలో ప్రయాణిస్తూ నిరసన తెలుపుతున్న హరీశ్‌రావు, కృష్ణారావు
కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దిగజారింది... వారిని ఆదుకునేలా
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
ఆటోల్లో ప్రయాణించిన కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్/శ్రీనగర్‌కాలనీ: ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పాలన కారణమని, ఆత్మహత్యలకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ‘ఆటో అన్నతో మాట ముచ్చట’పేరిట సోమవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఆటోల్లో ప్రయాణించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించిన ఆటో కార్మికుడు మష్రత్ అలీ ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో భేటీ అయ్యారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దిగజారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను రెండు ఆటోల యజమాని అని, అయితే ప్రస్తుతం వాటిని అమ్ముకుని అద్దె ఆటోను నడుపుతున్నానని ఆటో డ్రైవర్ మష్రత్ అలీ.. కేటీఆర్‌కు వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ పాలనలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేలు చెల్లించాలన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
హరీశ్.. కోకాపేట నుంచి ఎర్రగడ్డ వరకు
‘ఆటో అన్నతో మాట ముచ్చట’లో భాగంగా మాజీ మంత్రి హరీశ్‌రావు తన కోకాపేట నివాసం నుంచి ఎర్రగడ్డకు, అక్కడ నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో చేరుకున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో తమకు రోజూవారీ ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్నామని ఆటో కార్మికులు హరీశ్‌తో తమ ఆవేదన పంచుకున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటో ప్రయాణం చేసిన వారిలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కేపీ వివేక్, డాక్టర్ కె.సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శంభీపూర్ రాజు తదితరులు ఆటోల్లో ప్రయాణించి కార్మికులతో సంభాషించారు.


