రేవంత్ మంత్రివర్గం కచ్చితంగా దండుపాళ్యం ముఠానే
ఉన్నమాట అంటే కొందరు మంత్రులు ఉలిక్కి పడుతున్నారు
దక్కన్ సిమెంట్స్ ఓనర్ విషయంలో సీబీఐ విచారణకు సిద్ధమా: మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి మంత్రివర్గం కచ్చితంగా దండుపాళ్యం ముఠాయేనని మాజీమంత్రి టి.హరీశ్‌రావు మరోమారు విమర్శించారు. ఇదే విషయాన్ని ఒక్కసారి కాదు..పదిసార్లు అయినా అంటానని, ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులు ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య పంచాయితీల పరిష్కారం కోసమే కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. దక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని నిలదీశారు.
నిర్మల్ నియోజకవర్గ బీజేపీ నేత సిందే దీక్షిత్ తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణభవన్ వేదికగా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగు ణంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పరుగులు పెట్టాలి’అని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన రజక సంఘం సమావేశంలోనూ హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్ రెండేళ్లలో విపక్షాలను దుర్భాషలాడటం మినహా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అడ్డమైన భాషతో అధికారంలోకి వచ్చాడని, ప్రస్తుతం ప్రజలు కూడా అదే భాషతో సీఎంపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు.
ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు
‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చపాతీ మేకర్, రోడ్ రోలర్ వంటి గుర్తులతో అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్ వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశాడు. మద్యం ధరలను పెంచి ప్రజల నుంచి విచ్చలవిడిగా డబ్బు దండుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమితోనే తెలంగాణకు లాభం జరుగుతుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.


