
వరినాట్లు ఊపందుకోవడంతో పెరిగిన డిమాండ్
అవసరానికి మించి యూరియా సరఫరా చేశామన్న కేంద్రం ప్రకటనతో గందరగోళం
డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్..ఇలా అన్ని ఎరువులూ కలిపి చెప్పారంటున్న రాష్ట్ర అధికారులు
రైతులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందంటూ ఆందోళన
వానాకాలానికి 10.48 ఎల్‌ఎంటీల యూరియా అడిగితే 9.80 ఎల్‌ఎంటీలే కేటాయించారు
4 నెలల్లో 6.60 ఎల్‌ఎంటీలు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటివరకు 4.50 ఎల్‌ఎంటీలే ఇచ్చారు
కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ..తక్షణమే యూరియా సరఫరాకు విజ్ఞప్తి
ఆగస్టులో కనీసం 2 ఎల్‌ఎంటీలైనా వస్తేనే గండం గట్టెక్కుతామంటున్న అధికారులు
తీవ్రమైన కొరత నేపథ్యంలో ఒక్కొక్కరికి 2 బస్తాలే ఇస్తున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరినాట్లు ఊపందుకున్నాయి. దీంతో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ విధానంలో ఒక్కొక్కరికి రెండు బస్తాలే ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్‌కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్‌ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా..రాష్ట్రానికి కోటాకు మించి ఎరువులు సరఫరా చేశామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఇది రైతులకు తప్పుడు సంకేతాలను ఇస్తుందని, గ్రామాల్లో యూరియా కోసం ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంటున్నారు.
చర్చనీయాంశమైన కేంద్రమంత్రి ప్రకటన
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. తెలంగాణకు ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో అవసరమైన 20.30 ఎల్‌ఎంటీల కన్నా అధికంగా 22.15 ఎల్‌ఎంటీలు సరఫరా చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దీంతో బిత్తరపోవడం రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల వంతయ్యింది.
వాస్తవానికి ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి.. యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్‌ఎస్‌పీ ఎరువులు కలిపి 22.15 ఎల్‌ఎంటీ ఇచ్చినట్లు చెప్పాల్సిన కేంద్ర మంత్రి.. కేవలం యూరియానే 22.15 ఎల్‌ఎంటీ సరఫరా చేసినట్లుగా చెప్పారని ఓ అధికారి వివరించారు. నిజానికి ఇప్పటివరకు ఇచ్చిన యూరియా 4.50 ఎల్‌ఎంటీలు మాత్రమేనని చెప్పారు.
అసలు లెక్కలేంటి?
రాష్ట్రంలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ వానాకాలంలో ఏకంగా 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 10.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం ఈ సీజన్‌కు గాను నెలవారీగా 9.80 ఎల్‌ఎంటీలు మాత్రమే కేటాయించింది.
అదేమంటే యాసంగి సీజన్‌లో మిగిలిన యూరియా 1.92 ఎల్‌ఎంటీ గోదాముల్లో ఉందని, దాన్ని వినియోగించుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సమాచారం మేరకు.. ఏప్రిల్ నుంచి జూలై వరకు కేంద్రం 6.60 ఎల్‌ఎంటీల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 4.50 ఎల్‌ఎంటీలే వచ్చింది.
అంటే 2.10 ఎల్‌ఎంటీ (32 శాతం) తక్కువగా వచ్చిందన్న మాట. దీనికి రాష్ట్రం వద్ద ప్రారంభ నిల్వ కింద ఉన్న యూరియా 1.92 ఎల్‌ఎంటీలు కలిపితే మొత్తం 6.42 ఎల్‌ఎంటీలు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. ఇందులో సుమారు 5.20 ఎల్‌ఎంటీలు ఇప్పటికే రైతులకు విక్రయించగా.. 1.20 ఎల్‌ఎంటీల పైచిలుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.
2 ఎల్‌ఎంటీలైనా వస్తేనే..
ఈ సీజన్‌లో రాష్ట్రానికి కేటాయించిన 9.80 ఎల్‌ఎంటీలకు గాను జూలై వరకు 4.50 ఎల్‌ఎంటీలు సరఫరా చేసిన నేపథ్యంలో ఇంకా 5.30 ఎల్‌ఎంటీల యూరియా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లో కోత విధించిన 2.10 ఎల్‌ఎంటీలతో పాటు ఆగస్టు కోటా 1.70 ఎల్‌ఎంటీలు కలిపి ఈ నెలలో సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో అధికారులు సమావేశమై యూరియా కొరత పరిస్థితిని సమీక్షించారు.
ఆగస్టులో కనీసం 2 ఎల్‌ఎంటీల యూరియా అయినా వస్తేనే ప్రస్తుతానికి గట్టెక్కే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు లేఖ రాశారు. రాష్ట్రానికి యూరియా కేటాయింపులు, ఇప్పటివరకు కేంద్రం నుంచి వాస్తవంగా వచ్చిన యూరియా వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో కొరతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అవసరమైన యూరియాను పంపించాలని విజ్ఞప్తి చేశారు.