మంత్రివర్గాన్ని దండుపాళ్యం అంటావా?
రాష్ట్రాన్ని దోచుకున్న మీరు ‘స్టువర్ట్‌పురం దొంగలను మించిన బందిపోట్లు’
మంత్రివర్గం, సీఎంపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగాక్షమాపణ చెప్పాలి: మంత్రి అడ్లూరి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకొని, దాచుకొని ఇప్పుడు రాష్ట్ర కేబినెట్‌ను ‘దండుపాళ్యం బ్యాచ్’అంటారా అని మాజీమంత్రి హరీశ్‌రావుపై సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. మంత్రివర్గం, సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం మంత్రుల సముదాయంలో ఎమ్మెల్యేలు నాగరాజు, వేముల వీరేశం, మందుల సామేల్, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్‌యాదవ్‌లతో కలిసి మీడియాతో మంత్రి అడ్లూరి మాట్లాడారు.
మీ మామ, మీరు.. నీ బామ్మర్దులు దండుపాళ్యం ముఠా నాయకులని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచు కున్న మీరే ‘స్టువర్ట్‌పురం దొంగలకు మించిన బందిపోట్లు’అని ఘాటుగా విమర్శించారు. మీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నా, మీ ముగ్గురే నడిపించారని, అదే సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో దళితులు, బలహీనవర్గాలు ఉన్న కేబినెట్‌ను అవమానిస్తావా అని ప్రశ్నించారు. కేబినెట్‌పై మా ట్లాడిన హరీశ్‌రావును సిద్దిపేట దేవాలయంలో చర్చకు రావాలని సవాల్ విసిరితే రాకుండా తోక ముడిచారని మంత్రి అడ్లూరి అన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎవరినో పంపడం కాదు..నీకు దమ్మూ ధైర్యం ఉంటే చర్చకు నువ్వేరా.. ప్రజల ముందే చర్చిద్దామని సవాల్ విసిరారు.
⇒ బీఆర్‌ఎస్ దండుపాళ్యం బ్యాచ్‌కు నాయకుడు హరీశ్‌రావేనని మందుల సామేల్ అన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి పనిలో దోచుకున్నార న్నారు. నాగరాజు మాట్లాడుతూ మీరు చేసిన పనులకు లలిత్‌మోదీ, విజయ్ మాల్యలు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారన్నారు. వేముల వీరేశం మాట్లాడుతూ మంత్రి అడ్లూరి సవాల్ ను స్వీకరించకుండా హరీశ్‌రావు పారిపోయారని చెప్పారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లు మాట్లాడుతూ కేసీఆర్ అడ్రస్‌లేదని, వస్తారో లేదో కూడా తెలవదని ఎద్దేవా చేశారు. ఎంపీ అనిల్ మాట్లాడుతూ ప్రజలను మో సం చేస్తే సరైన తీర్పు ఇస్తారన్నారు.


