breaking news
adluri laxman kumar
-
Land Cruiser: రూ.3కోట్ల కారు.. ఊడిపోయిన టైరు
కోరుట్ల: ఆ కారు ఖరీదు ఇంచుమించు రూ.3 కోట్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పేరున్న కారు. ఏదైనా ప్రమాదం జరిగి.. కారు పల్టీలు కొట్టినా పది ఏయిర్ బ్యాగులు తెరుచుకుని భద్రత విషయంలో ఏ మాత్రం బెదిరిపోవాసిన అవసరం లేదన్న ప్రచారం ఉంది. దీనికితోడు బులెట్ ప్రూఫ్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఖరీదైన కారు టైరు చిన్నపాటి ప్రమాదంలో ఎలా ఊడిపోయిందని స్థానికంగా చర్చ నడుస్తోంది. కారులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. అదే సమయంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కారు భద్రతపై మాత్రం లెక్కలేని సందేహాలు వస్తున్నాయి.అసలేం జరిగింది..?శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మంత్రి అడ్లూరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కోరుట్ల వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో మెట్పల్లి నుంచి తిరిగి ధర్మపురి వెళ్లేందుకు తన కారులో బయలుదేరారు. 15 నిమిషాల్లో కారు మెట్పల్లిదాటి మారుతీనగర్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో దెబ్బతిన్న ఓ కారును కోరుట్లలోని మెకానిక్ షెడ్ నుంచి నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి తీసుకువెళ్తున్న టోచన్ వాహనం ఎదురుగా వచ్చింది. రెండు వాహనాలు ఎదురెదురుగా చిన్నగా తగిలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అకస్మాత్తుగా మంత్రి కారు టైర్ ఊడిపోయింది. కారు టైర్ ఊడిపోవడం మినహా మంత్రి కారుకు ఎక్కడా ఎలాంటి గీత పడకపోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో మంత్రి అడ్లూరి క్షేమంగా బయటపడగా.. టోచన్ వాహనంతో కారును తెస్తున్న వారిలో ఇమ్రాన్ అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే మెట్పల్లి పోలీసులు వచ్చి రెండు వాహనాలను అక్కడి నుంచి తరలించి కేసు నమోదు చేశారు. భద్రత సంగతి దేవుడెరుగు..మంత్రి కారులో ఉన్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఏ పరికరంలోనైనా విడిభాగాలను బిగించే చిన్న చిన్న నట్లు, స్క్రూలు, ఇతరత్రా పరికరాల్లో కొంచెం తేడా వచ్చినా.. లూజు అయినట్లు ఉన్నా ప్రమాద సూచికలు ఇస్తుందని సమాచారం. శనివారం రాత్రి జరిగిన చిన్నపాటి ప్రమాదానికే ఫోర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఉన్న మంత్రి కారు టైరు ఎలా ఊడిపోయిందన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ కారు టైర్ ముందుగానే కాస్త లూజ్ అయి ఉంటే దానికి సంబంధించిన ప్రమాద సూచికలు ఎందుకు రాలేదన్న సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ప్రమాద సంకేతాలు వచ్చినా డ్రైవర్ సరిగా దృష్టి పెట్టలేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తుగా ప్రమాదాన్ని నివారించే టెక్నాలజీ వ్యవస్థ సైతం ఈ కారులో ఉంది. అంతే కాకుండా ఈ వాహనం భద్రతా రేటింగ్ 5 స్టార్ కావడం గమనార్హం.అవే కార్లు...గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రుల కోసం ఇదే రకం 22 కార్లను కొనుగోలు చేసిన విషయం తెలి సిందే. కొత్త ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా లో టు ఉన్నా ఇంత లగ్జరీ కార్లు ఎలా కొనుగోలు చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అవే కార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు కేటాయిస్తున్నారు. శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కేటా యించిన కారు కూడా అదే కావడం గమనార్హం. -
ముగ్గురికే పట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్)లు ప్రమాణ స్వీకారం చేశారు. ఊహించినట్టుగానే ఈ దఫాలో ఈ ముగ్గురికే మంత్రులుగా అవకాశం లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:13 నిమిషాలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం తొలుత వివేక్ వెంకటస్వామి, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, అనంతరం వాకిటి శ్రీహరిల చేత గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణం చేయించారు. దైవ సాక్షిగానే వివేక్ ఇంగ్లిష్‌లో, మిగిలిన ఇద్దరు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ముగ్గురిని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు పూలబొకేలు ఇచ్చి అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మరోమారు జాతీయగీతాలాపనతో 12:22 నిమిషాలకు ప్రమాణ కార్యక్రమం ముగిసింది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ జి ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు, కేబినెట్ మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు. రాజ్‌భవన్‌లో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్‌తో మంత్రులుగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో సీఎం రేవంత్ మరో మూడు బెర్తులు ఖాళీగానే... కొత్తగా ముగ్గురు ప్రమాణం చేయడంతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మరో 11 మంది కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడు మరో ముగ్గురు కొత్తగా మంత్రులు కాగా, ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉండిపోయాయి. ఈ మూడు బెర్తులను కూడా వీలున్నంత త్వరలోనే భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రెండో దఫా కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సరిగ్గా సంవత్సరం ఏడు నెలల తర్వాత విస్తరణకు ముహూర్తం కుదిరింది. 2023, డిసెంబర్ 7న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, మళ్లీ 2025, జూన్ 8న తొలిదఫా విస్తరణ జరిగింది. అదిగో.. ఇదిగో అంటూ పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ముగ్గురిని కేబినెట్లో తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. -
మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్
హైదరాబాద్, సాక్షి: సుచిత్రం భూవివాదంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు, తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి వాదిస్తుండగా, మరోవైపు ఆ భూమి తమ 15 మందిదేనని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్ అడ్లూరి లక్ష్మణ్ వాదిస్తున్నారు.సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కోసం వివాదం కొనసాగుతోంది. తమ అనుచరులతో మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఆ స్థలంలో పాతిన ఫెన్సింగ్, బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఇంకోవైపు అక్కడికి చేరుకున్న 15 మంది ఆ స్థలం తమదేనని వాదించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పబోయిన పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ పీఎస్‌కు తరలించారు. పోలీసుల జోక్యంతో.. రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో సర్వే చేపట్టారు. తాజాగా వివాదాస్పద భూమిపై సర్వే పూర్తైంది. యితే పోలీసులకు సర్వే రిపోర్ట్ ఇస్తారని భావించగా.. బదులుగా కలెక్టర్‌కు రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించబోతున్నారని తెలుస్తోంది. దీంతో స్థల వివాదానికి ఎలాంటి ముగింపు దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. -
కారు బోల్తా..కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాయాలు
-
Telangana: ప్రమాదంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్ కుమార్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిచగా.. అడ్లూరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.