
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో (Telangana Politics) ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మధ్య మాటల వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. ఐక్యంగా పోరాటం చేస్తాం, కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు క్షమాపణ చెప్పారు. లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను.. మంత్రి అడ్లూరి, పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు. నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడిలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు.

సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది. మేమంతా ఐక్యంగా భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం’ అని తెలిపారు.
సమస్య ముగిసింది: అడ్లూరి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..‘అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని నేను కాదు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తా.. కానీ, పొన్నం వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది అని చెప్పుకొచ్చారు.
టీపీసీసీ కీలక వ్యాఖ్యలు..
అనంతరం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడింది. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబ సమస్య. జరిగిన ఘటన పట్ల చింతిస్తూ మంత్రి ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహచర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ’ అని తెలిపారు.