బీఆర్ఎస్ నేతలు అరెస్ట్..
- బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ అరెస్ట్
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చర్చకు రాచాలంటూ.. 125అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
- బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్‌కు పోలీసులకు మధ్య తోపులాట
- బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలింపు
తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి హరీష్, కొప్పుల ఈశ్వర్ మధ్య రాజకీయ సవాళ్లు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాలనపై చర్చకు సచివాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని మంత్రి కొప్పుల సవాల్ విసిరారు. దమ్ముంటే హరీష్ రావు చర్చకు రావాలి అంటూ మంత్రి అడ్లూరి ప్రతి సవాల్ విసిరారు. దీంతో, రాజకీయం ఆసక్తికరంగా మారింది.
మంత్రి వర్సెస్ మాజీ మంత్రి..
పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనతో చర్చకు రావాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కొప్పుల వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందిస్తూ..
హరీష్ రావు గడ్డ మీదకి వెళ్ళి సవాల్ విసిరాను. దమ్ముంటే హరీష్ రావు చర్చకు రావాలి. నా మీద ఓడిన కొప్పుల ఈశ్వర్ రావడం ఏంటి?. హరీష్ మొహం చాటేసుకుని పోయారు. నేను నా ఇంట్లో రెడీగా ఉన్నాను. హరీష్, కేటీఆర్ వస్తే బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాను. కొప్పుల ఈశ్వర్, రసమయి వస్తే మా ప్రీతం వెళ్ళి సమాధానం చెప్తాడు. కేబినెట్ పర్సనల్ పంచాయితీలు జరగలేదు. హరీష్ రావు వచ్చి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ పాలన.. మా పాలనపై దమ్ముంటే చర్చకు రండి అని కామెంట్స్ చేశారు.
హరీష్ రావు కౌంటర్..
మరోవైపు.. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా ఆటోలో కోకాపేట్ నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు ప్రయాణించారు. అనంతరం, ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు వెళ్లారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరితో చర్చకు మా నాయకుడు కొప్పుల ఈశ్వర్ వస్తారు. కొప్పుల ఈశ్వర్‌తో చర్చకు కాంగ్రెస్ నేతలు రెడీగా ఉండాలి. కేబినెట్‌లో మంత్రుల పంచాయితీలు జరిగాయని అన్ని మీడియాలో సైతం వచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరిపై ఒకరు దూషించుకున్నారన్న నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవటానికే ఆటోలో ప్రయాణం చేశాను.
రేవంత్ రెడ్డి పేరుకు ఉచిత బస్ అన్నారు. ఐదుసార్లు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతున్నారు. రాహుల్ గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు. అశోక్ నగర్ వెళ్లి మెట్లపై కూర్చుని మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారు. ఆటోలో వెళ్లి యూసుఫ్‌గూడలో ఆటో వాళ్లకి ఇచ్చిన హామీలను విస్మరించారు. రాష్ట్రంలో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి. ఒక్కొక్క ఆటో కార్మికులకు 24 వేల రూపాయలు కాంగ్రెస్ బాకీ ఉంది. రాహుల్ గాంధీ మళ్ళీ హైదరాబాద్‌కి రావా?. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్దే రాహుల్ గాంధీకి ఆటోలు అడ్డంగా పెట్టి కార్మికులు అడ్డుకుంటారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. మంత్రులు వాటాలు పంచుకోవడానికి డబ్బులు ఉంటాయి.. కానీ, ఆటో కార్మికులకు ఇవ్వడానికి ఉండవా?. మూడువేల కోట్ల రూపాయల ఆదాయం మద్యంపై వచ్చింది. అవి ఆటో కార్మికులకు ఇవ్వండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆటో కార్మికులకు కాపాడుకుంటాం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించండి. లేని ఫ్యూచర్ సిటీకి 5000 కోట్లతో ఎందుకు రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వం వద్ద పైసలు లేక కాదు.. కమిషన్ వచ్చే వాటిపైన మాత్రమే దృష్టి పెడుతున్నారు. గద్దెనెక్కినంక గరీబోళ్ళని మర్చిపోయారు..


