
తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ (Congress) మంత్రుల మధ్య విభేదాలు హీటెక్కించాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వివేక్‌పై (G.Vivek) సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో.. మంత్రి పొన్నం స్పందించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో(Adluri Laxman Kumar) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా స్పందించారు. ‘‘అడ్లూరిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా వాఖ్యలు వక్రీకరించారు. ఇదంతా బీఆర్‌ఎస్ కుట్ర. ఆ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని అన్నారాయన.
ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
అడ్లూరి వీడియోలో.. ‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?..
.. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.
పొన్నం పేరిట వైరల్ అయిన వీడియోలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్‌చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో.. ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ పొన్నం అన్నట్లు ఉంది.
ఇదీ చదవండి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బిగ్ ట్విస్ట్