
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కీలక నేత నవీన్ యాదవ్‌పై(Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ(Election Code) ఆయనపై కేసు నమోదు చేశారు.
వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ సోమవారం విదులైన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేశారు. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై అధికారులు సీరియస్ అయ్యారు.
అనంతరం, దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావిస్తూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్‌పై బీఎన్ఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 170,171,174 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఇక, తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.