
ధర్మపురి(జగిత్యాల జిల్లా): నిజామాబాద్‌లో మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి తన సహచర మంత్రి వివేక్ మాట్లాడటం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సాక్షి టీవీతో మాట్లాడారు అడ్లూరి.
‘లక్ష్మణ్ కుమార్ తండ్రి జయంతి కార్యక్రమాల్లో పేరు పెట్టకపోతే ప్రశ్నిస్తున్నాడు... ఇతర ఇన్విటేషన్స్ లో పేరు లేకపోతే ఎందుకు ప్రశ్నించడని వివేక్ మాట్లాడటం బాధాకరం. నేను ఆ విషయమే అసలెక్కడా మాట్లాడలేదు. వెంకటస్వామి జన్మదిన వేడుకలను నా ధర్మపురి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిపాకే నేను హైదరాబాద్ వెళ్లాను.నాకు ఆ అభిమానం ఉంది. నా మైనార్టీ శాఖ కార్యక్రమానికి వారే వచ్చి వస్తడా, రాడా వెళ్లిపొమ్మంటరా అంటూ మాట్లాడటం ఎంతవరకు సబబు..?, తోటి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను ఓ జంతువుతో పోలుస్తూ మాట్లాడితే కనీసం సహచర దళిత మంత్రిగా ఖండించకపోవడాన్నే నేను ప్రశ్నించా.
తెల్లారే వ్యక్తిగతంగా ఫోన్ కాల్ అయినా చేస్తాడని భావించా. ఇవాళ మళ్లీ నిజామాబాద్‌కు వెళ్లి వ్యక్తిగతంగా నా పేరు తీసి మాట్లాడటం ఇక వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నా.
రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాలి తప్ప ఈ విధంగా కామెంట్స్ చేయడం బాధాకరం. నేను కాంగ్రెస్ వ్యక్తిని, వ్యక్తిగత విభేదాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నా. కాంగ్రెస్‌లో పెద్దలు ఆశీస్సులతో ఇంత వరకూ వచ్చా’ అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.