సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. కాంగ్రెస్ మంత్రులు, మాజీ మంత్రి హరీష్ అనే విధంగా రాజకీయం నడుస్తోంది. తాజాగా హరీష్ వ్యాఖ్యలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కౌంటరిచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికలో ఓట్ల కోసమ బీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతోంది. బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. గులాబీ నేతల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావుకు లేదు. బీఆర్‌ఎస్ ఎన్నో హామీలను ఎగ్గొట్టింది. ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు.
మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. హరీష్ రావు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల మంత్రులు ఉన్న కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అని హరీష్ రావు ఎలా అంటారు. రాష్ట్ర మంత్రి వర్గం దండుపాళ్యం బ్యాచ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం స్టువర్ట్ పురం దొంగలా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న కేబినెట్‍పై చేసిన వ్యాఖ్యలకు గాను హరీష్ రావు తక్షణమే క్షమాపణలు చెప్పాలి.
కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ కవిత చేసిన ఆరోపణలపై చర్చకు రమ్మంటే తొక ముడిచిన హరీష్ రావు.. ఇప్పుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను చర్చకు పంపుతానంటున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావడానికి మేము సిద్ధమేనన్నారు. కేసీఆర్ మీ అల్లుడ్ని కంట్రోల్‍లో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్ కు తెలియకుండా హరీష్ రావు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారు. అందువల్లే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా హరీష్ రావుకు కేసీఆర్ వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.


