
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. సహచర మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను పక్కనే కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. పొన్నం తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొన్నం ఎపిసోడ్‌పై మంత్రి అడ్లూరి వీడియోను విడదల చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాజాగా మాట్లాడుతూ..‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి.
నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?. నేను త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ని కలుస్తాను. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. పొన్నం అంటుంటే సహచర మంత్రిగా ఉన్న వివేక్ కనీసం ఖండించలేదు. వివేక్ కొడుకును దగ్గరుండి ఎంపీగా గెలిపించాం కదా?. ఇది కూడా గుర్తులేదా?. కాకా వెంకటస్వామి నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. కానీ, వివేక్‌ది ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
జూబ్లీహిల్స్ లో మంత్రులు పెట్టిన ప్రెస్ మీట్ లో లేటుగా వచ్చినా అడ్లూరి లక్ష్మణ్ ను “దున్నపోతు” అంటున్నా పొన్నం అన్న
మనకి టైం అంటే తెలుసు ఆ..దున్నపోతు గాడికి టైం గురించి ఎం తెలుసు... pic.twitter.com/g0F8wq38vL— Arshad (@Iamarshad46) October 5, 2025
Video Credit: Arshad
టీపీసీసీ చీఫ్ ఫోన్..
మరోవైపు.. కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టి సారించారు. విషయం తీవ్రతరం కాకుండా రంగంలోకి దిగి.. తాజాగా మంత్రులు పొన్నం, అడ్లూరికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. ఇద్దరు నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. మంత్రి పొన్నం వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదంటూ శ్రీధర్ బాబు సూచించారు. ఇక, తన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. తన వక్రీకరించారని తెలిపారు. అడ్లూరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు.