
శనివారం కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీసు స్టేషన్ ముందు కూర్చున్న వీరంతా అన్నదాతలు. బీబీపేట రైతు వేదికలో 600 బస్తాల యూరియా అందుబాటులో ఉండగా రైతులు భారీగా తరలిరావడంతో టోకెన్ల కోసం ఘర్షణలు జరుగుతాయని భయపడ్డ వ్యవసాయ అధికారులు వారిని పోలీసుస్టేషన్‌కు తరలించి పోలీసులతోనే టోకెన్లు ఇప్పించారు.
క్యూలో ఘర్షణలు పెరగడంతో క్విక్ రియాక్ట్ టీంల పహారా, పోలీసు స్టేషన్లలో రైతులకు యూరియా టోకెన్లు
కామారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో కొరత తీవ్రం
వరి పొట్ట దశకు రావడంతో అన్నదాతల్లో ఆందోళన
సమయానికి యూరియా వేయకుంటే పంట పోయినట్టే
9.91 ఎల్‌ఎంటీకి ఇప్పటివరకు 7 ఎల్‌ఎంటీ మాత్రమే రాక
ప్రస్తుతం అందుబాటులో 23 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా పంపిణీ పోలీసుల చేతుల్లోకి వెళ్తోంది. పంటల అదును దాటిపోతోందన్న బాధతో రైతు వేదికల ముందు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు.. ఎలాగైనా యూరియా దక్కించుకోవాలన్న ఆశతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల రైతులను అదుపు చేసేందుకు సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. వ్యవసాయ సహకార సొసైటీలకు వస్తున్న యూరియా తక్కువగా ఉండటం, రైతులు అధిక సంఖ్యలో లైన్లలో వేచిచూస్తుండటంతో అధికారులు టోకెన్ల పంపిణీకి జంకుతున్నారు. ఆ బాధ్యతను కూడా పోలీసులకే అప్పగిస్తున్నారు.
తరుముతున్న కాలం..
రాష్ట్రంలో వానాకాలం వరి పంట చాలా జిల్లాల్లో పొట్టదశకు వచ్చింది. గింజ గట్టి పడేందుకు, మొక్కకు బలాన్నిచ్చేందుకు ఇప్పుడు యూరియా వాడకం అత్యవసరం. అదును తప్పితే యూరియా వేసినా ఉపయోగం ఉండదు. దీంతో రైతులు సొసైటీ ఆఫీసులు, యూరియా దుకాణాల ముందు రాత్రి పగలు పడిగాపులు పడుతున్నారు.
రాష్ట్రంలోని 500 రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ జరుపుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. దీంతో ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల ప్రజలంతా ఉదయాన్నే రైతు వేదికల వద్దకు వచ్చి లైన్లల్లో నిలబడుతున్న దృశ్యాలు దాదాపు అన్ని జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరినాట్లు ముందుగా పడే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మలిదశ యూరియా వాడకం కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి.
‘అదును తప్పుతోంది.. ఒక్క బస్తా అయినా ఇప్పించండి’అని కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల మొదలైన జిల్లాల రైతులు అధికారులను ప్రాధేయపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూరియా కొరత లేకుండా కేంద్రంతో మాట్లాడి తెప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రోజూ ప్రకటనలు ఇస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఉన్నది 23 వేల మెట్రిక్ టన్నులే..
రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న యూరియా ఏ రోజుకు ఆరోజే అన్నట్లుగా అయిపోతోంది. నిల్వ లేకుండా డిమాండ్‌కు అనుగుణంగా వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు యూరియాను ఆయా జిల్లాల్లో డిమాండ్ అధికంగా ఉన్న మండలాలకు పంపిస్తున్నారు. రైల్వే వ్యాగన్ల ద్వారా ప్రతిరోజు 5 వేల టన్నులకు తగ్గకుండా యూరియాను కేంద్రం నుంచి తెప్పిస్తున్నా.. అది ఏమూలకు సరిపోవడం లేదు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే ఉన్నాయి.
అందులో సొసైటీల వద్ద 6 వేల మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 7 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే టోకెన్ల ప్రకారం ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఈ నిల్వల్లో 70 శాతం వరకు పంపిణీ చేసి, మిగతా నిల్వను మరుసటి రోజు కోసం దాచిపెడుతున్నారు. మార్క్‌ఫెడ్ గోదాముల్లో ఉన్న 10 వేల మెట్రిక్ టన్నులను ఆచితూచి పంపిస్తున్నారు. వీటికి తోడు ఆ రోజు వచ్చే రైల్వే వ్యాగన్ల లోడ్ మీదనే వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ ఆధారపడుతోంది.
సరఫరా చేసింది 7 లక్షల టన్నులు..
రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్‌లో ఇప్పటివరకు సరఫరా చేసిన యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఒక లక్ష ఎకరాలు తక్కువగా అంచనాలో 98 శాతం మేర సాగయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం ఉన్నది ఈ సీజన్‌లోనే. ఇందులో యూరియా అత్యధికంగా వినియోగించే వరి ఏకంగా వ్యవసాయ శాఖ అంచనాలకు మించి 104 శాతం సాగైంది.
65.52 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మొక్కజొన్న కూడా అంచనాకు మించి 122 శాతం.. అంటే 6.36 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి 45.76 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ మూడు పంటలకే కాకుండా ఉద్యాన పంటలకు కూడా యూరియా వినియోగం అధికంగా ఉండడంతో రైతులకు ఈ పరిస్థితి తలెత్తింది. గత సంవత్సరం కన్నా దాదాపు 10 లక్షల ఎకరాలు పంటల విస్తీర్ణం పెరగ్గా, యూరియా కేటాయింపులు మాత్రం తగ్గాయి.
ఈ నెలాఖరు వరకు 9.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 7 లక్షల మెట్రిక్ టన్నులే. కనీసం మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు వెంటనే వస్తే తప్ప రైతులకు బాధలు తప్పవు. అదును తప్పిపోయిన తరువాత యూరియా వచ్చినా ఉపయోగం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచే యూరియా విక్రయంలో రేషన్ పద్ధతి పాటించేలా చేయడంలో విఫలమైన అధికార యంత్రాంగం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది. దీంతో సామాన్య చిన్న, సన్నకారు రైతులు ఒక్కో యూరియా బస్తా కోసం పడిగాపులు పడుతున్నారు.