అత్యవసర సమయాల్లో బస్సు అద్దాలు పగలగొట్టేందుకు వాడే సుత్తిని పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
ఎయిర్‌హోస్టెస్ తరహాలో భద్రతా సూచనలు చేయనున్న ఆర్టీసీ డ్రైవర్
ప్రయాణికులకు వివరించాలని ఆర్టీసీ ఆదేశం..
నేటి నుంచి అమల్లోకి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు మంటలంటుకొని 19 మంది సజీవదహనమైన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తమైంది. ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ప్రయా ణికులు వీలైనంత వేగంగా తప్పించుకునేలా వారిలో అవగాహన కల్పించే ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రయాణికులకు వివరించాలని డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. అలాగే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో అగ్నిమాపక పరికరా లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఎయిర్ హోస్టెస్ తరహాలో...: విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులను విధిగా అప్రమత్తం చేస్తారు. విమానంలోని అత్యవసర మార్గాలు, ఆక్సిజన్ మాస్కులను ధరించాల్సిన విధానం, లైఫ్ జాకెట్ పొందే తీరు, అందులో గాలి నింపే పద్ధతి.. ఇలా అన్ని అంశాలనూ ప్రయాణికులకు వివరిస్తారు. ఇదే తరహాలో ఇకపై బస్సు డ్రైవర్లు కూడా ప్రారంభ స్టేషన్‌లో ప్రయాణికులకు కొన్ని సూచనలు చేయనున్నారు. తొలుత తనను తాను పరిచయం చేసుకొని ఆపై కండక్టర్ పేరు వెల్లడిస్తారు. అలాగే బస్సు ఎప్పుడు బయలుదేరి తుది గమ్యం ఏ వేళకు చేరుకుంటుందో వివరిస్తారు.
బస్సులో అగ్నిమాపక పరికరాలను ఉంచిన ప్రదేశం.. వాటిని వాడే విధానం.. అత్యవసర తలుపు ఉండే చోటు.. దాన్ని తెరిచే పద్ధతి.. అత్యవసర సమయంలో కిటికీ అద్దాలను పగలగొట్టేందుకు వాడే సుత్తిని ఎలా వాడాలో, దాన్ని బస్సులో ఎక్కడ ఉంచారో వెల్లడిస్తారు. ఏసీ బస్సుల్లో రూఫ్ హాచెస్ తెరిస్తే పొగ బయటకు వెళ్లిపోతుందని, అత్యవసర సమయాల్లో వాటి నుంచి కూడా ప్రయాణికులు బయటపడే వీలుంటందని కూడా వివరించనున్నారు. మరోవైపు ప్రస్తుతం ఏసీ బస్సుల్లోనే సుత్తులు ఉంటుండగా ఇటీవల కొన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ అందుబాటులో ఉంచుతున్నారు. ఇక నుంచి ఏసీ సహా అన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా సుత్తులు, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు.


