ప్రపంచవ్యాప్తంగా 48 లక్షలకు చేరుకున్న సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలు
నిపుణులకు ఉన్న డిమాండ్, సప్లై మధ్య నానాటికీ పెరుగుతున్న వ్యత్యాసం
భారత సంస్థలపై వారానికి సగటున 3,233 సైబర్ దాడులు
దాడుల కోసం ఎక్కువగా కృత్రిమ మేధ సాంకేతికత వాడుతున్న హ్యాకర్లు
చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సైబర్ హ్యాకర్లు కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటూ దాడులకు తెగబడుతుండగా దీన్ని అధిగమించేందుకు సైబర్ భద్రతా నిపుణుల కొరత పెద్ద సమస్యగా మారుతోందని తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగుల ఖాళీలు 48 లక్షలకు చేరుకున్నాయని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 19% ఎక్కువని పేర్కొంది. ముఖ్యంగా భారత కంపెనీలు, సంస్థలు వారానికి సగటున 3,233 సైబర్ దాడులను ఎదుర్కొంటున్నట్లు చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.
అలాగే విద్యా రంగం వారానికి 7,095, ప్రభుత్వ శాఖలు, అనుబంధ విభాగాలపై 5,140, వినియోగదారుల వస్తువులు, సేవలు లక్ష్యంగా 3,889 సైబర్ దాడులు జరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆన్‌లైన్ సేవలు ఉపయోగించుకునే వినియోగదారులే లక్ష్యంగా హ్యాకర్లు వారి కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి కృత్రిమ మేధను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
కంపెనీలకు పెరుగుతున్న ‘భద్రత’ ఖర్చు
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాలు, రిటైల్, హెల్త్‌కేర్, తయారీ రంగాల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం వేగంగా పెరుగుతోందని చెక్ పాయింట్ సంస్థ పేర్కొంది. భారత్‌లో దాదాపు 10 లక్షల మంది సైబర్ భద్రతా నిపుణులకు డిమాండ్ ఉండగా ప్రస్తుతం 5 లక్షల మంది సైబర్ నిపుణులే అందుబాటులో ఉన్నారని తెలిపింది.
ఈ నైపుణ్యాల అంతరం భద్రతా ఉల్లంఘనల ప్రమాదాన్ని పెంచడంతోపాటు ఆయా కంపెనీలు, సంస్థల నిర్వహణా ఖర్చులు కూడా భారీగా పెరిగేందుకు కారణమవుతోందని విశ్లేషించింది. అక్టోబర్ నెలను సైబర్ భద్రతా అవగాహన మాసంగా పాటిస్తుండగా...ఈ నెల ముగింపు నేపథ్యంలో దేశంలో డిజిటల్ భద్రత, నైపుణ్యాల తక్షణ అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఏ నైపుణ్యాలకు అధిక డిమాండ్ అంటే..
– ఏఐ, మెషీన్ లెరి్నంగ్ సెక్యూరిటీ
– క్లౌడ్ కంప్యూటింగ్
– డిజిటల్ ఫోరెన్సిక్స్
– ఆటోమేషన్ నైపుణ్యం, అప్లికేషన్ భద్రతా పరీక్ష
ఏఐ ఆధారిత నిఘా పెంచాలి..
డిజిటల్ ప్రపంచం మరింత వేగం సంతరించుకోవడంతో ఆర్థిక సేవలు, విద్యుత్ తదితర రంగాలకు చెందిన సంస్థలు హ్యాకర్లకు కీలక లక్ష్యాలుగా మారతాయి. ఈ నేపథ్యంలో సంస్థలన్నీ ఏఐ–ఆధారిత నిఘా, పర్యవేక్షణ విధానాలను అవలంబించాలి. డీప్ ఫేక్ ముప్పు గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. సైబర్ దాడులను తిప్పికొట్టే శక్తివంతమైన ప్రతిస్పందన ప్రణాళికలను రూపొందించాలి
– సైబర్ భద్రతా నిపుణులు
ప్రపంచ దేశాల్లో ఇటీవల జరిగిన సైబర్ దాడులు ఇలా..
అమెరికాకు చెందిన జివెట్ కామెరాన్ ట్రేడింగ్ కంపెనీపై హ్యాకర్లు దాడి చేసి 35 వేల మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించడంతో ఆ సంస్థ ట్రేడింగ్‌లో తీవ్రంగా నష్టపోయింది.
– జపాన్‌కు చెందిన ఈ–కామర్స్ సంస్థ ‘ఆస్కల్’ సైబర్ దాడికి గురవడంతో తమ ఆన్‌లైన్ ఆర్డర్లన్నింటినీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
– యూరప్‌కు చెందిన వివిధ రక్షణరంగ కంపెనీలపై జరిగిన ఫిషింగ్ అటాక్ వల్ల ఆయా సంస్థల యూఏవీలు, డ్రోన్ల డిజైన్లు, కీలక ఆయుధాల వివరాలు లీక్ అయ్యాయి.
– కెనడాకు చెందిన ఆట»ొమ్మల సంస్థ ‘టాయ్స్‌ఆర్‌అజ్’పై సైబర్ నేరస్తులు దాడి చేసి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించి డార్క్ వెబ్‌లో విక్రయించారు.
వీటికి ముప్పు ఎక్కువ..
⇒ తగినంత మంది సైబర్ నిపుణులు లేని సంస్థలు డేటా ఉల్లంఘనలు, గోప్యతా ఉల్లంఘనలు, ఆర్థిక మోసాలకు ఎక్కువగా గురవుతాయి.
⇒ తప్పుడు కాన్ఫిగరేషన్‌లు, అసురక్షిత ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) కారణంగా క్లౌడ్ వాతావరణాలు ఎక్కువగా ప్రమాదంలో పడతాయి.


