
రేపు జంతు వధశాలలు బంద్
గ్రేటర్ వరంగల్ సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి
వరంగల్ అర్బన్: దసరా పర్వదినం, గాంధీ జయంతి సందర్భంగా డ్రై డే పాటించాలని బల్దియా ప్రజారోగ్యం అధికారులు మటన్, చికెన్ నిర్వాహకులకు, వ్యాపారులకు మంగళవారం సర్క్యూలర్ జారీ చేశారు. షాపులు తెరవొద్దని, డ్రై డే తప్పనిసరిగా పాటించాలని హెచ్చరికలు చేస్తున్నారు. గిర్మాజీపేట, లక్ష్మీపురం, కాజీపేట జంతువధ శాలలను బంద్ చేస్తామని గ్రేటర్ వరంగల్ సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి ప్రకటించారు.
ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోతే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి, జరిమానాలు విధిస్తామని, కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవైపు వైన్ షాపులు, మరోవైపు మాంసం షాపులు మూసివేస్తుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది మాత్రం ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వ్యక్తంగా గొర్రెలు, మేకలు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద వధించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.