రారమ్మంటున్న కార్యక్రమాలు..
విభిన్న థీమ్స్‌తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్‌సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్‌లోని గ్రీన్‌వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంక్ బండ్ వద్ద బిగ్‌బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్‌తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్‌లోనూ ఫుడ్‌తోపాటు ఆల్కహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హాప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్లలు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది.


