వైరెటీ థీమ్స్.. ఈవెంట్స్
సాక్షి, వరంగల్/వరంగల్ క్రైం : నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్‌లు, భద్రకాళి బండ్ నయా జోష్‌కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్‌లో వరంగల్ తేలిపోనుంది.
సంతోషాలతో వేడుకలు
నిర్వహించుకుందాం..
సీపీ సన్‌ప్రీత్ సింగ్
సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రజల దృష్టికి వస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సీపీ కోరారు.
గ్రేటర్ వరంగల్‌లో
థర్టీ ఫస్ట్ వేడుకలకు ఏర్పాట్లు
లైవ్ మ్యూజిక్, స్టెప్పులతో సెలబ్రెటీల సందడి
అన్ లిమిటెడ్ ఫుడ్,
లిక్కర్ ప్యాకేజీలకు డిమాండ్


