అసమానతలు తొలగించాలి
● అర్చక ఉద్యోగుల కోసం చట్ట సవరణ చేయాలి
● తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ
జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ
ఎల్కతుర్తి: దేవాదాయ శాఖలో కొనసాగుతున్న వేతన అసమానతలను వెంటనే తొలగించి, ధూప–దీప నైవేద్య అర్చకులను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ డిమాండ్ చేశారు. మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఆలయ ఉప ప్రధాన అర్చకుడు రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధూప–దీప నైవేద్య అర్చకుల కోసం ప్రత్యేకంగా చట్టసవరణ చేసి వారిని దేవాదాయ శాఖలో భాగం చేయాలని కోరారు. మూడు కేటగిరీల దేవాలయాల్లో పని చేస్తూ ఇప్పటికీ రెగ్యులర్ కాకుండా ఉన్న అర్చక ఉద్యోగులు 8 వేల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారి హక్కుల సాధన కోసమే పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 121ఈవోను రద్దు చేసి దేవాలయాల్లో ఐదేళ్లు సేవ పూర్తి చేసిన తాత్కాలిక అర్చకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ చొరవ తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈనెల 2న మడికొండలో నిర్వహించనున్న వరంగల్ ఉమ్మడి జిల్లా అర్చక ఉద్యోగ సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అర్చకులు రాంబాబు, శ్రీకాంత్‌శర్మ, వినయ్, సందీప్, రమేశ్, శరత్‌చంద్ర, శివకుమార్, శ్రావణ్, సిబ్బంది భిక్షపతి, రాజేందర్, కళ్యాణి, రాజు, కవిత తదితరులు పాల్గొన్నారు.


