ఆగుతూ.. సాగుతూ
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంలో అభివృద్ధి పనులు ఆగుతూ సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకే కార్పొరేట్ తరహాలో వైద్య సేవలందించేందుకు ఉద్దేశించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు అనుకున్నంత వేగంగా ముందుకుసాగడం లేదు. వరంగల్ నగర ట్రాఫిక్ సమస్యను తీర్చే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం కనబడుతోంది. వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాన్ని చేర్చే వేదికై న వరంగల్ ఆధునిక బస్టాండ్ నిర్మాణ పనులు నింపాదిగా జరుగుతున్నాయి. ఇక వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకోగా, ఏళ్లుగా కలలు కంటున్న మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణ చివరి దశకు చేరుకుంది. వచ్చే మార్చికల్లా ఏఏఐ అధికారులు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే, రూ.వందల కోట్ల వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు నగరంలో స్మార్ట్ సిటీ పనుల్లో ఆలస్యం, అండర్ గ్రౌ ండ్ డ్రెయినేజీ పనులు ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది.
‘సూపర్ ఆస్పత్రి’ ఇంకా ఆలస్యమే..
వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్‌లో ప్రారంభమయ్యాయి. 2024లోనే ఇది అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా నింపాది పనులతో వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా అక్కడ మరో 500 పడకలు (కార్డియాలజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) పెంచి రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆధునీకరించిన రైల్వే స్టేషన్
అమృత్ భారత్ పథకం కింద రూ.25.41 కోట్ల నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్‌ను కార్పొరేట్ సదుపాయాలతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా అధికారులు తీర్చిదిద్దారు. ఈ ఏడాది అక్టోబర్‌లో పూర్తిస్థాయి హంగులతో అది అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల తోరణం, రెండు స్తంభాలపై రెండు ఏనుగులు, విశాలమైన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, శిల్పకళా సంపద ఉట్టిపడేలా ఎలివేషన్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ర్యాంపులు, ల్యాండ్ స్కేపింగ్, టికెట్ కౌంటర్, ప్లాట్‌ఫాంలతో పాటు గోడలకు ఇరువైపులా కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా కళాకృతులు, నూతన హంగులతో వెయిటింగ్ హాళ్లను తీర్చిదిద్దారు. 5 రూపాయలకే సురక్షిత తాగునీరు, ఇంటర్నెట్ కోసం వైఫై.. ఇలా అధునాతన సౌకర్యాలతో రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్‌లో వేలాది మంది ప్రయాణికులు ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు.
జిల్లాలో అభివృద్ధి పనుల తీరిది
నింపాదిగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు
ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో నత్తనడక
ఆలస్యంగా ప్రారంభమై తుది దశలో జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు
తుదిదశకు చేరుకున్న మామూనూరు విమానాశ్రయ భూసేకరణ
అత్యాధునిక వసతులతో ఆధునీకరించిన రైల్వే స్టేషన్
నింపాది పనులతో తప్పనితిప్పలు
వరంగల్ పాత ఆజంజాహి మిల్లు మైదానంలో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనులు ఇప్పటికే పూర్తికావాల్సి ఉండగా, తాజాగా గోడలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈపాటికే ఈ పనులు పూర్తై అన్ని విభాగాలు ఇక్కడకు రావాల్సి ఉన్నా కొత్త సంవత్సరంలో ఈ కొత్త భవనంలోకి అన్ని తరలనున్నాయి. మూడెకరాల్లో ఐదొంతస్తుల ప్రణాళికతో కుడా పర్యవేక్షణలో సరికొత్త హంగులతో నిర్మితమవుతున్న వరంగల్ మోడ్రన్ బస్టాండ్ పనుల్లో నిర్లక్ష్యం కనబడుతోంది. నెలలు గడుస్తున్నా ఇంకా ఆరంభ దశలోనే పనులు ఉండడంతో అటువైపుగా వచ్చే ప్రయాణికులకు తాత్కాలిక బస్టాండ్‌తో తిప్పలు తప్పడం లేదు. అలాగే వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు, భూనిర్వాసితులకు పరిహారం సకాలంలో అందక ఆలస్యమవుతోంది.
జెట్‌స్పీడ్‌లా ఎయిర్‌పోర్టు భూసేకరణ
మామునూరు విమానాశ్రయానికి 223 ఎకరాల భూసేకరణ కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు, అక్టోబర్ 17న మరో రూ.90 కోట్ల మంజూరుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది. 223 ఎకరాల్లో ఇప్పటివరకు 180 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి భూనిర్వాసితుల ఖాతాల్లో రూ.220 కోట్లను రెవెన్యూ అధికారులు జమచేశారు. మరో రూ.40 కోట్లు బిల్లులను చెల్లింపునకు సిద్ధంగా ఉంచారు. కోర్టు వివాదాల్లో 15 ఎకరాలుండగా ఆ మేరకు డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే, సాదాబైనామాకు సంబంధించి భూమి ఐదెకరాలు ఉండడంతో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉందనే వివరాలపై క్షేత్రస్థాయిలో అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే, మరో పదెకరాల పట్టా పాస్‌బుక్కులు, 12 మంది ఇంటి యజమానుల వివరాలను పరిశీలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
ఆగుతూ.. సాగుతూ
ఆగుతూ.. సాగుతూ
ఆగుతూ.. సాగుతూ
ఆగుతూ.. సాగుతూ
ఆగుతూ.. సాగుతూ


