మెరుగైన వైద్యసేవలే మా లక్ష్యం
ఎంజీఎం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. చలికాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు వస్తున్న న్యూమోనియా వంటి వ్యాధులకు పిల్లల విభాగంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. వైద్యులు, వైద్య సిబ్బంది రోస్టర్‌పై ప్రత్యేక దృష్టి సారించి జనవరి ఒకటో తేదీ నుంచి కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టుబోతున్నామని పేర్కొన్నారు. కిందిస్థాయి సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యంపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వైద్య సేవలను మెరుగుపరుస్తున్నామని వివరించారు. ఎంజీఎం ఆస్పత్రిలో అందుతున్న సేవలు, నెలకొన్న సమస్యలపై సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజల సందేహాలకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి సమాధానమిచ్చారు.
ప్రశ్న: చలికాలంలో చిన్నపిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– మహేందర్, నల్లబెల్లి
సూపరింటెండెంట్: చలికాలంలో చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారు చలిబారిన పడకుండా స్వెటర్, మఫ్లర్, ఉన్ని దుస్తులు ధరించేలా చూడాలి. అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు తీసుకెళ్లకూడదు. చలికాలంలో వచ్చే జలుబు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రశ్న: జలుబు, దగ్గుకు ఏ చికిత్స తీసుకోవాలి?
– రాజ్‌యాదవ్, వేలేరు, వీరేందర్, శాయంపేట
సూపరింటెండెంట్: సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గువంటి వాటిపై చిన్నపిల్లలు, వృద్ధులు అశ్రద్ధ వహించకూడదు. జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంది. తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యుడి సూచనల మేరకు ఔషధాలు వాడాలి.
ప్రశ్న: ఎంజీఎంలో మెరుగైన సేవల కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
– స్వరూప్‌రెడ్డి, సుబేదారి
సూపరింటెండెంట్: ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వైద్యుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించాం. వైద్య సిబ్బంది, పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది రోస్టర్ల మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. సిబ్బంది అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: గురక, ఊపిరితిత్తుల వ్యాధులకు చికిత్స
అందిస్తారా?
– శ్రవణ్, కాశిబుగ్గ
సూపరింటెండెంట్: గురక, ఊపిరితిత్తుల సమస్యల చికిత్స కోసం టీవీ ఆస్పత్రిని సంప్రదించాలి. హనుమకొండలోని కేయూ క్రాస్ రోడ్డు వద్ద ప్రభుత్వ పరిధిలో ప్రత్యేక టీబీ ఆస్పత్రి ఉంది. ఇలాంటి వ్యాధులకు కావాల్సిన ఎంఆర్‌ఐ, సీటి స్కాన్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంజీఎం ఆస్పత్రిలో చేస్తాం.
ప్రశ్న: కొండనాలుక వాపునకు ఏం చేయాలి?
– కుమార్, నల్లబెల్లి
సూపరింటెండెంట్: ఎంజీఎంలోని ఈఎన్‌టీ విభాగంలో ఇలాంటి నొప్పులకు చికిత్స అందిస్తాం. ఆస్పత్రిలో ఓపీ విభాగం సేవలను మెరుగుపర్చాం. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈఎన్‌టీ వైద్యుల వద్ద చికిత్స పొందవచ్చు.
ప్రశ్న: ఈసీజీ సేవలు అందుబాటులో ఉన్నాయి?
– శివాజీ, ఖిలా వరంగల్
సూపరింటెండెంట్: ఆస్పత్రిలో సాంకేతిక లోపంతో మరమ్మతులకు గురైన పరికరాలపై దృష్టి సారించాం. వారం రోజుల్లో మరో ఆరు ఈసీజీ పరికరాలు అందుబాటులోకి వస్తాయి. క్యాజువాలిటీతో పాటు కీలక విభాగాల్లో ఈసీజీ సేవలను అందించేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేశాం.
ప్రశ్న: ఎంజీఎంలో సేవలపై ప్రజల్లో ఉన్న
అపోహలను ఎలా తొలగిస్తారు?
– సరిత, కరీమాబాద్
సూపరింటెండెంట్: ఎంజీఎంలో వైద్య సేవలను మెరుగుపరుస్తూ రోగులను సంతృప్తి పరుస్తాం. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాం. సమస్య తిరిగి పునరావృత్తం కాకుండా శాశ్వత కోణంలో పరిష్కారానికి శ్రీకారం చుడుతున్నాం.
పిల్లలకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నాం
చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరి
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
వైద్యుల సమయ పాలనపై ప్రత్యేక
దృష్టి సారించాం
సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్
డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి
మెరుగైన వైద్యసేవలే మా లక్ష్యం


