
వరంగల్ జిల్లా: గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు ‘గెస్ట్’ పోలీస్ స్టేషన్ అనే పేరుంది (నిక్‌నేమ్). పోలీసు అధికారులు ఈ స్టేషన్‌కు అలా గెస్ట్‌లా వచ్చి కొన్ని రోజులు పని చేసి బదిలీపై వెళ్లిపోతుంటారు. సీఐలు అయితే మహా అంటే ఏడాది లోపు.. ఎస్సైల విషయం చెప్పాల్సిన పనే లేదు. బదిలీపై వచ్చిన ఎస్సైలు ఇక్కడ ఎన్ని నెలలు ఉంటారో లేదో తెలియదు. కొందరైతే పోస్టింగ్‌పై వచ్చి రెండు, మూడు నెలల లోపే బదిలీ అవుతున్నారు. గతంలో అయితే బదిలీపై వచ్చిన పోలీసు అధికారులు కనీసం ఏడాది, రెండేళ్ల వరకు విధులు నిర్వర్తించేవారు. దీంతో వారికి స్థానిక పరిస్థితులపై, ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అవగాహన కోసం అవసరమైన సమయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది.
వచ్చిన అధికారికి మండలంలోని గ్రామాల పేర్లు, రూట్‌లు, స్థానిక స్థితిగతులు తెలుసుకునే లోపే బదిలీ అవుతుండడం విశేషం. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకత ఉంది. ఈ పోలీస్ సేషన్ పరిధిలోని గీసుకొండ రూరల్ మండలంలోని గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్ నగరంలోని 15,16,17 డివిజన్లు ఉన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉండే మండలంలో ప్రశాంతంగా ఉన్నట్లే కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయని ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన పలువురు పోలీసు అధికారులే చెబుతున్నారు.
అలాంటి పరిస్థితిలో డ్యూటీలో చేరిన నెలలోపే బదిలీ చేస్తుండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గీసుకొండ సీఐ మహేందర్‌ను ఇక్కడి నుంచి పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ఇక్కడికి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆయన స్థానంలో పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న డి. విశ్వేశ్వర్‌ను గీసుకొండకు బదిలీ చేశారు. విశ్వేశ్వర్ ఇదే పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా 2012 జూలై నుంచి 2013 ఆగస్టు వరకు పని చేశారు. అప్పట్లో ఆయన పనితీరును చూసి మండల వాసులు గబ్బర్‌సింగ్ అని పిలిచేవారు.