వైరెటీ థీమ్స్.. ఈవెంట్స్
గ్రేటర్ వరంగల్‌లో థర్టీ ఫస్ట్ వేడుకలకు ఏర్పాట్లు
సాక్షి, వరంగల్: నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్‌లు, భద్రకాళి ట్యాంకుబండ్ నయా జోష్‌కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్‌లో వరంగల్ తేలిపోనుంది.
రారమ్మంటున్న కార్యక్ర మాలు..
విభిన్న థీమ్స్‌తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇలా రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్‌సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్‌లోని గ్రీన్‌వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంకు బండ్ వద్ద బిగ్‌బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్‌తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్‌లోనూ ఫుడ్‌తోపాటు ఆల్కాహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్ల లు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది.
లైవ్ మ్యూజిక్, స్టెప్పులతో సెలబ్రెటీల సందడి
అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ ప్యాకేజీలకు డిమాండ్
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి ఫుల్‌జోష్..
పంచాయతీ ఎన్నికలతో సందడిగా మారిన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు డిసెంబర్ థర్డీ ఫస్ట్ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలిచిన ఉత్సాహంలో ఉన్న సర్పంచ్‌లు తమ అనుచరుల కోసం ఇప్పటికే చికెన్, మటన్, మద్యం కొనుగోలు చేశారు. డీజే సిస్టం కూడా సమకూర్చుకుంటున్నారు. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండనుండడంతో ఆ పదవులు ఆశించే నాయకులు ఇప్పటి నుంచే తమ బలగం కోసం వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ నయాసాల్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


