యాప్ నుంచి ఎరువులను బుక్ చేసుకోవాలి
దుగ్గొండి: రైతుల అవసరాల మేరకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని తొగర్రాయి గ్రామంలో మంగళవారం ఆయన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని పరిశీలించారు. యూరియా టోకెన్ల పంపిణీ, సరఫరా విధానాన్ని సమీక్షించి మాట్లాడారు. యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాస రమ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యాప్ ద్వారా ఎరువులను బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్‌పై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. మండలాలకు అవసరమైన యూరియా సరఫరా చేశామని తెలిపారు. ప్రతి రైతు తన ఆరోగ్యదీపిక కార్డులో పంటల వివరాలను నమోదుచేసి యూరియా తీసుకోవాలని సూచించారు. నర్సంపేట, వర్ధన్నపేట వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్‌రెడ్డి, గజ్జల నర్సింగం, ఏఓ గాజుల శ్యాం, ఏఈఓ విజయ్‌నాయక్, ఉపసర్పంచ్ బుస్సాని రాజు, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్


