గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె..

Dec 31 2025 8:44 AM | Updated on Dec 31 2025 8:44 AM

గీసుక

గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె..

గీసుకొండ: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారంగా గీసుకొండ లక్ష్మీనర్సింహస్వామి ప్రతీతి. గీసుకొండ మండల కేంద్రం శివారులో నల్లరాతి గుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. గీసుకొండ గ్రామంలోని ప్రసిద్ధ వేణుగోపాలస్వామి ఆలయం నుంచి స్వామివారిని వేదమంత్రాలు, బాజాభజంత్రీలతో సాయంత్రం ఐదు గంటలకు గుట్టపైకి తోడ్కొని వెళ్లి ఆలయ ప్రవేశం చేయిస్తామని ఆలయ వంశపారంపర్య వ్యవస్థాపక ధర్మకర్తలు వేదాంత మురళీకృష్ణమాచార్యులు, వెంకట నర్సింహాచార్యులు తెలిపారు. శుక్రవారం ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు ఉంటాయిని, మూడో తేదీన జాతర ప్రారంభమై ఐదో తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. చివరిరోజు సాయంత్రం స్వామివారిని ఊరేగింపుతో గీసుకొండ వేణుగోపాలస్వామి ఆలయ ప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుందని వారు తెలిపారు. భక్తులకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గుట్ట వద్ద రెయిలింగ్‌, మెట్లు, దిగవన ఆలయ నిర్మాణం తదితర అభివృద్ధి పనులను పలువురు దాతలు ముందుకు వచ్చి చేపట్టారు.

ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు సాక్ష్యం..

గుట్టచుట్టూ సుమారు 70 ఎకరాల ప్రాంతంలో మధ్యశిలా యుగం మొదలుకొని శాతవాహనుల కాలానికి సంబంధించిన ఎన్నో చారిత్రక ఆధారాలు బయల్పడ్డాయి. 2001లో తొలిసారిగా గీసుకొండకు చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు ముత్తినేని రాధాకృష్ణ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. మధ్య రాతియుగానికి సంబంధించిన సూక్ష్మరాతి పనిముట్లు, నవీన శిలా యుగానికి సంబంధించిన గొడ్డళ్లు, నూరే రాళ్లు, మట్టి పెంకులు, బృహత్‌ శిలాయుగపు సమాధులు (మెగాలిథిక్‌ బరియల్స్‌) వెలుగుచూశాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన పురావస్తుశాఖ వారు పరిశీలన కోసం నాలుగు ట్రెంచ్‌లను తవ్వడంతో మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి ట్రెంచ్‌లో బౌద్ధానికి సంబంధించిన స్తూపం బయటపడింది. అందులోనే బోధిసత్వుడి తెల్లని ప్రతిమ బయటపడటంతో జిల్లాలోనే మొదటి బుద్ధిస్ట్‌ సైట్‌గా దీన్ని గుర్తించారు. శాతవాహనుల నాణెం కూడా లభించింది. ఈ విషయం గతంలో పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. ఇక్కడ లభ్యమైన వస్తువులను వరంగల్‌ పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి, మరింత లోతుగా పరిశోధనలు చేస్తే చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది..

లక్ష్మీనర్సింహస్వామి

ఆలయంలో నిర్వాహకుల ఏర్పాట్లు

జనవరి ఒకటిన సాయంత్రం

గుట్టపైకి చేరనున్న స్వామివారు

మూడు నుంచి జాతర.. తరలిరానున్న వేలాది మంది భక్తులు

గుట్ట దిగువ భాగంలో బయల్పడిన ఎన్నో చారిత్రక ఆధారాలు

గుట్టతోనే ‘గీసుకొండకు’ ఆ పేరు

సుమారు 400 అడుగుల ఎత్తులో ఉన్న నల్లరాతి గుట్ట ఆధారంగానే సమీపంలో ఏర్పడిన గీసుకొండ గ్రామానికి ఆ పేరు వచ్చి ఉంటుందని అంటున్నారు. ‘గీసు’ అంటే నల్లని అని, నల్లని కొండ కావడంతో గీసుకొండ అని పేరు వచ్చిందని కొందరు చెబుతున్నారు. శిలాయుగంలో ఆయుధాలకు పదు ను పెట్టడానికి కొండను గీసే వారని, అందువల్లే ‘గీసుడు–కొండ’ అని పేరు వచ్చిందని.. కాలక్రమేణా గీసుకొండగా మారి ఉంటుందని హైదరాబాద్‌ పురావస్తుశాఖ నిపుణులు అభిప్రాయపడ్డారు.

భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం..

జాతరకు వచ్చే భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గుట్టపైన భక్తులు కూర్చోవడానికి గద్దెలు, కింది భాగంలో చలువ పందిళ్లు వేశాం. దిగువన ఉన్న స్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.

– ఏనుగుల సాంబరెడ్డి, ఆలయ చైర్మన్‌

గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె..1
1/2

గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె..

గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె..2
2/2

గీసుకొండ బ్రహ్మోత్సవాలకు వేళాయె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement