
హనుమకొండలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్. చిత్రంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్
సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి/సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ కోసం సవరించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీని వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖపై సచివాలయంలో మంత్రి శనివారం సమీక్షించా రు. ఇటీవల తుమ్మిడిహెట్టి, సుందిళ్లను సందర్శించిన అధికారులు సమరి్పంచిన క్షేత్ర పరిశీలనల నివేదికలను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గతంలో నిర్మించిన ప్రధాన కాలువ, ఇతర నిర్మాణాలు చాలావరకు చెక్కుచెదరకుండా ఉన్నాయని, స్వల్ప మరమ్మతుల తర్వాత ఉపయోగించుకోవచ్చని అధికారులు వివరించారు. 71 కి.మీ.లు విస్త రించి ఉన్న ప్రధాన కాలువ నెట్‌వర్క్ ఉపయోగించదగిన స్థితిలో ఉందని, రెండు ప్రధాన అక్విడక్ట్‌లు 70 శాతం పూర్తయ్యాయని అధికారులు నివేదించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి అక్కడి నుంచి సుందిళ్ల బరాజ్ వరకు నీటిని గ్రావిటీతో తరలించొచ్చని ఇంజనీర్లు చేసిన సూచనను ఆయన స్వాగతించారు. దీనితో కొత్త పంప్‌హౌస్ నిర్మించి బహుళ దశల్లో లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు వివరించారు. సుందిళ్ల బరాజ్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని అధికారులు మంత్రికి తెలియజేశారు.
తుమ్మిడిహెట్టి నుంచి 71 కి.మీ. ప్రధాన కాల్వలో 45 కి.మీ. కాల్వ తవ్వకం పూర్తయిందని, ఇతర పనులూ పాక్షికంగా పూర్తయ్యాయని క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలపై సమగ్ర ప్రతిపాదనలు సమర్పిస్తే నెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. వచ్చే వారం మళ్లీ సమీక్షిస్తానని, అక్టోబర్ చివరి నాటికి సవరించిన డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల స్థలాల్లో సౌర ప్లాంట్లు
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన సాగునీటి ప్రాజెక్టుల భూములను గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఉత్పత్తి చేసే విద్యుత్‌ను సాగునీటి పథకాలు, పంపింగ్ స్టేషన్ల నిర్వహణకు ఉపయోగిస్తే పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలను ఆదా చేయొచ్చని చెప్పారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నరు
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే బద్నాం చేస్తున్నాడని, తమ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు, ఆల్మట్టి ఎత్తు పెంపునకు పూర్తిగా వ్యతిరేకమని మంత్రి ఉత్త మ్ స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు. గోదావరి, కృష్ణాజలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్‌ఎస్ పార్టీ అని పునరుద్ఘాటించారు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ అరుదైన రికార్డు
ధాన్యం దిగుబడిలో తెలంగాణ అరుదైన రికార్డు నమోదు చేసుకోనుందని మంత్రి ఎన్.ఉత్తమ్ చెప్పారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా కోటీ 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై శనివారం సాయంత్రం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, అందులో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లా కేంద్రాలలో ఇప్పటికే 1,205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఈనెల 16న హైదరాబాద్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు నీటిని ఎత్తిపోయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు వాడకున్నా, తెలంగాణ వరిసాగులో రికార్డు సృష్టించిందన్నారు. నర్సంపేట ఎమ్మె ల్యే దొంతి మాధవరెడ్డికి మాతృవియోగం జరగ్గా.. ఆయనను పరామర్శించేందుకు మంత్రి ఉత్తమ్ శనివారం హనుమకొండకు వచ్చారు. అనంతరం మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులతో కలిసి మీడియాతో మాట్లాడారు.