
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, మిలిటరీ అప్లికేషన్లతో సహా హై-టెక్ పరిశ్రమలకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ-స్కాండియం, యిట్రియం, లాంథనం, సీరియం, సెమారియం.. వంటి అరుదుగా దొరికే లోహాలు) కీలకం. దశాబ్దాలుగా చైనా ఎర్త్ మైనింగ్, లోహశుద్ధిలో ఆధిపత్య శక్తిగా ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 70% వరకు దాదాపు అన్ని ప్రాసెసింగ్ కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది. ఇటీవల పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆర్‌ఈఈకు సంబంధించి చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఇతర దేశాలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్‌ఈఈలను స్వతంత్రంగా ప్రాసెసింగ్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
లైనాస్ రేర్ ఎర్త్స్
అరుదైన లోహాల ఉత్పత్తిలో ‘లైనాస్ రేర్ ఎర్త్స్’ సంస్థ కీలకంగా మారుతుంది. ఇది చైనా వెలుపల భారీ అరుదైన లోహాల వాణిజ్య ఉత్పత్తిదారుగా ఉంది. ఆర్ఈఈ ప్రాసెసింగ్‌పై చైనా గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడంలో మలేషియా కేంద్రంగా ఈ ప్లాంట్ పని చేస్తుంది. ప్రపంచ అరుదైన లోహాల సరఫరాలకు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా దాని పాత్రను బలోపేతం చేసుకుంటోంది. లైనాస్‌కు యూఎస్ ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోంది.
ఇదీ చదవండి: ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీ
ప్రత్యామ్నాయాలు
చైనీస్ రేర్ ఎర్త్ సరఫరాలపై ఆధారపడటం వల్ల కలిగే ఆర్థిక, భద్రతా ప్రమాదాలను గుర్తించి అనేక దేశాలు తమ సొంత వనరులను అభివృద్ధి చేసుకుంటున్నాయి. స్థానికంగా మైనింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.
అక్లారా రిసోర్సెస్ (బ్రెజిల్): యూఎస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సరఫరా చేయడానికి ఈ రేర్ ఎర్త్ గనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచ ఆర్‌ఈఈ సరఫరా గొలుసులో లాటిన్ అమెరికా పాత్రను ఇది మరింత పెంచుతుందని భావిస్తున్నారు.
యుకోర్ రేర్ మెటల్స్ (యూఎస్): అమెరికా రక్షణ శాఖ నిధులతో ఈ సంస్థ చైనా ప్రాసెసింగ్ పద్ధతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కొత్త సెపరేషన్ టెక్నాలజీపై పనిచేస్తోంది.
ఆస్ట్రేలియా, కెనడా: ఈ దేశాలు తమ రేర్ ఎర్త్ మైనింగ్ సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తున్నాయి. బహుళ కంపెనీలు స్థానిక నిక్షేపాలను అన్వేషిస్తున్నాయి.