
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం దర్యాప్తు ముమ్మరం
మహదేవ్ బెట్టింగ్‌యాప్ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టిని విచారిస్తున్నట్లు తెలిపింది. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో పిట్టి ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంతో స్టాక్ మానిప్యులేషన్, మనీలాండరింగ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నిషాంత్ పిట్టిపై ఆరోపణలు..
అసోసియేట్ ల్యాప్‌టాప్ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలు ద్వారా పిట్టిని అక్రమ బెట్టింగ్ ప్లాట్ ఫామ్ అయిన స్కై ఎక్స్ఛేంజ్‌కు ఏజెంట్‌గా గుర్తించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా మహదేవ్ బెట్టింగ్‌యాప్ ఆపరేటర్లతో సంబంధం ఉన్న డొల్ల కంపెనీలకు ఈజ్ మై ట్రిప్ చెల్లింపులు చేసిందని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ పిట్టి నివాసంలో సోదాలు నిర్వహించి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకుంది. స్టాక్ ధరలను తారుమారు చేయడం, చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడం లక్ష్యంగా ఉన్న బిగ్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ లావాదేవీలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పెట్టుబడుల్లో బాద్‌షా ఈ దేవర
పిట్టి ప్రతిస్పందన
నిషాంత్ పిట్టి ఈ ఆరోపణలను ఖండిస్తూ ఈడీ సూచించిన వ్యక్తులు, కంపెనీల గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. 2017 నుంచి ఈజ్ మై ట్రిప్ ఏ సంస్థలకు చెల్లింపులు చేయలేదని, పారదర్శకత, చట్టబద్ధమైన కార్యకలాపాలకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నానని, అన్ని ఆర్థిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తెలిపారు.