
విచ్చలవిడిగా రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలు
గాలి, నీరు, భూమి విషతుల్యం
లాభాల వేటలో కంపెనీలు.. రోగాల బారిన జనం
అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మినరల్స్)... రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదానికి దారితీస్తున్న అంశమిది. తమకు తక్కువ ధరకే ఈ ఖనిజాలు సరఫరా చేయాలని చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా, డ్రాగన్ దేశం అందుకు ఒప్పుకోవడం లేదు. ఎంతో అరుదైన, విలువైన ఈ ఖనిజాలు చైనా గడ్డపై ఉండడం, అవి తమకు సులువుగా దక్కకపోవడం సహజంగానే అమెరికాకు రుచించడం లేదు. అందుకే చైనాపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా అమెరికాను చైనా బహిరంగంగా ధిక్కరిస్తోంది అంటే అందుకు కారణం ఈ ఖనిజాలే అనే చెప్పొచ్చు.
ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లు, ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు సోలార్ ప్యానెళ్లు, ఎంఆర్‌ఐ మిషన్లు, జెట్ ఇంజన్లు, విదుŠయ్త్ పరికరాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ వాడకం తప్పనిసరిగా మారింది. ఇదే ఇప్పుడు చైనా పంట పండిస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఈ ఖనిజాల్లో సగానికిపైగా చైనా నుంచే వస్తున్నాయి. అరుదైన ఖనిజాల మైనింగ్, శుద్ధి, ఎగుమతుల విషయంలో చైనా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు ఏముందో చూస్తే...
నీరు, భూమి కలుషితం
చైనాలో ఉత్తరాన ఉన్న ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని బయాన్ ఓబో, దక్షిణాన జియాంగ్‌జీ ప్రావిన్స్‌లోని గాంగ్‌ఝౌలో రేర్ ఎర్త్ ఖనిజాల గనులున్నాయి. ఆయా ప్రాంతాల్లో దశాబ్దాలుగా తవ్వకాలు సాగుతున్నాయి. భారీ యంత్రాలు, వాహనాల రొదతో అవి నిత్యం దద్దరిల్లుతుంటాయి. పొరలు పొరలుగా భూమిని పెకిలించి వేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతోపాటు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్న గనులు స్థానికులకు మాత్రం నరకానికి నకలుగా మారిపోయాయి. పచ్చని మైదానాలు మసిబారిపోయాయి. గడ్డి భూములు ప్రమాదకరమైన దుమ్ము ధూళితో నిండిపోయాయి. లోతైన గనుల నుంచి దట్టమైన దుమ్ము మేఘాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భూమాతకు గాయాలవుతూనే ఉన్నాయి. గాలి, నీరు, భూమి దారుణంగా కలుషితం అవుతున్నాయి.
చట్టవిరుద్ధంగా తవ్వకాలు
గనుల నుంచి వెలువడే రేడియోయాక్టివ్ బురదను నిల్వ చేయడానికే సమీపంలో కృత్రిమంగా సరస్సులు నిర్మించారు. కాలుష్యం కారణంగా స్థానికులు రోగాల బారినపడుతున్నారు. పెద్దలకు క్యాన్సర్లతోపాటు శిశువులకు పుట్టుకతో లోపాలు పరిపాటిగా మారాయి. ఇదంతా బాహ్య ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అపరిచితులను గనుల వైపు అనుమతించడం లేదు. మైనింగ్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అందులో వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు.
గనుల తవ్వకంతో వెలువడే మట్టి, బురదలో ప్రాణాంతకమైన భార లోహాలు, రేడియోయాక్టివ్ అవశేషాలు ఉంటున్నాయి. టన్నుల కొద్దీ అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్‌తోపాటు ఇతర రసాయనాలు భూ ఉపరితలంపై పేరుకుపోతున్నాయి. చైనాలో వేలాది మైనింగ్ సైట్లు ఉన్నాయి. వీటిలో చట్టవిరుద్ధమైనవే ఎక్కువ. ఒక చోట తవ్వకానికి అనుమతులు తీసుకొని మరికొన్ని చోట్ల అక్రమంగా మైనింగ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గనుల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. మైనింగ్ లైసెన్స్‌ల సంఖ్య తగ్గించింది. అయినప్పటికీ అక్రమ గనులు సంఖ్య పెరిగిపోతోంది తప్ప తగ్గడం లేదు. కేవలం ఒక టన్ను ఖనిజాలు కావాలంటే ఏకంగా 2,000 టన్నుల మట్టిని తవ్వాల్సి ఉంటుంది.
గ్రామాలకు గ్రామాలే ఖాళీ
గనుల వల్ల జరగాల్సిన నష్టం చాలావరకు ఇప్పటికే జరిగిపోయింది. మైనింగ్ ప్రాంతాల్లో అడవులు అంతరించిపోయాయి. భూముల్లో గోతులే మిగిలాయి. నదులు, పంట పొలాలు పనికిరాకుండా పోయాయి. భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. ఒక విధానం అంటూ లేకుండా తవ్వకాలు సాగిస్తుండడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మైనింగ్ కంపెనీలు రైతుల పొలాలను కూడా వదలిపెట్టడం లేదు. వారు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. బడా కంపెనీలపై చట్టపరంగా కోర్టుల్లో పోరాడే శక్తి లేక మిన్నకుండిపోతున్నారు. కొన్నిచోట్ల గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. మరోవైపు గనుల తవ్వకం ఆపాల్సిందేనని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్