
లేజర్‌బీమ్ సహిత గగనతల రక్షణ వ్యవస్థ ‘ఐరన్‌బీమ్’ను మోహరించిన ఇజ్రాయెల్
సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే కొత్తశకం ఆయుధాలను ఇజ్రాయెల్ ఈ తరంలోనే తీసుకొచ్చి మరోసారి ప్రపంచ రక్షణరంగాన్ని ఔరా అనిపించింది. శత్రు దేశాల యుద్ధ విమానాలపై క్షిపణులను ప్రయోగించకుండా నేరుగా లేజర్ కాంతిపుంజాన్ని ప్రయోగించి విమానాలను నేలకూల్చే వ్యవస్థను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది.
అత్యంత ప్రభావవంతంగా ఇది పనిచేస్తోందని, సమరక్షేత్రంలోనూ దీని సత్తాను పరీక్షించామని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దీనిని ఐరన్‌బీమ్ అని పేరు పెట్టింది. శత్రుసేనల డ్రోన్ల దండును ఒకేసారి వందలాది చిన్నపాటి క్షిపణులతో నేలమట్టంచేసే ఐరన్‌డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో ఇజ్రాయెల్ ఇప్పటికే ఆధునిక తరం ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్‌ల మోహరింపులో తన పైచేయి సాధించింది.
వందలాది హమాస్ రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి ఈ ఐరమ్‌డోమ్ ఇప్పటికే తన సత్తా చాటింది. దీనికి తోడుగా ఇప్పుడు లేజర్‌కాంతిపుంజ సహిత ఐరన్‌బీమ్ వ్యవస్థను సంసిద్ధం చేశామని ఇజ్రాయెల్ రక్షణవర్గాలు ప్రకటించాయి. ఎప్పటికప్పుడు కొత్త రకం ఆయుధాలతో దేశ సైనికరక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ పటిష్టంచేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఐరన్‌బీమ్ ను రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారుచేసింది.
కేవలం రెండు డాలర్లతో మటాష్
విధ్వంసం సృష్టించేందుకు నేలమీదకు దూసుకొచ్చే శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, మానవరహిత విహంగాలు, మోర్టార్‌లను గాల్లోనే అడ్డుకునేందుకు ఉపయోగించే సంప్రదాయక క్షిపణి నిరోధక వ్యవస్థను ఒక సందర్భంలో ఉపయోగిస్తే ఏకంగా 60,000 డాలర్లు అంటే రూ.53 లక్షలు ఖర్చవుతుంది. శత్రువుల రాకెట్లను అడ్డుకునేందుకు చిన్నపాటి రాకెట్లు, ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించాల్సి రావడం వల్లే ఇంతటి ఖర్చు అవుతుంది. కానీ కొత్తగా రణరంగంలోకి దిగిన ఈ ఐరన్‌బీమ్‌ను ఒకసారి ఉపయోగిస్తే కేవలం 2 డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది.
మెరుపువేగంతో అమితమైన విద్యుత్‌ను ఉపయోగించుకుని కొత్త కాంతిపుంజాన్ని వదులుతుంది. అందుకే అత్యల్ప ఖర్చుతోనే అత్యధిక ప్రయోజనాన్ని పొందొచ్చు. సంప్రదాయక గగనతల రక్షణవ్యవస్థలో ప్రయోగించే కొన్ని చిన్నపాటి రాకెట్లు గురితప్పొచ్చు. వృథా ఖాయం. కానీ ఐరన్‌బీమ్ కాంతిపుంజాన్ని గురిచూసి ప్రయోగిస్తారు. కాంతిమాదిరిగా అత్యంత కచ్చితత్వంతో సరళరేఖ మాదిరి ఈ కాంతిపుంజం దూసుకుపోతుంది. దీంతో దిశ మారే అవకాశమే లేదు. ఏ పాయింట్ వద్ద కొడతామో అక్కడే విమానం, డ్రోన్, క్షిపణి ముక్కలుచెక్కలుకావడం ఖాయం. బీమ్ ప్రయోగానికి అది లక్ష్యాన్ని ఛేదించడానికి మధ్య సెకన్ల వ్యవధి కూడా పెద్దగాఉండదని ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నాఫ్తాలీ బెన్నెట్ చెప్పారు.
ఉన్న వాటితో కలుపుకుని పోతూ..
ఐరన్‌బీమ్‌ను అందుబాటులోకి తెచ్చినంత మాత్రాన ఐరన్‌డోమ్, డేవిడ్ స్లింగ్, యారో సిస్టమ్ వంటి ఇతర గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ పక్కనబెట్టబోదు. యుద్ధ రీతి, అవసరానికి అనుగుణంగా వీటినీ మోహరిస్తుంది. అవసరమైతే ఐరన్‌డోమ్‌కు తోడుగా ఐరన్‌బీమ్ కదనరంగంలో రణానికి సిద్ధంకానున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖలోని పరిశోధనా భివృద్ధి విభాగం, ఇజ్రాయెల్ వాయుసేన, రఫేల్, ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా నెలల తరబడి కష్టపడి ఐరన్‌బీమ్‌ను సాకారంచేశాయి. దీనిని ఇప్పటికే దక్షిణ ఇజ్రాయెల్‌లో పలుమార్లు విజయవంతంగా పరీక్షించారు. రఫేల్ అడ్వాన్స్‌డ్ సంస్థలోని అడాప్టివ్ ఆప్టిక్స్ సాంకేతికతను సైతం ఐరన్‌బీమ్‌కు జోడించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్