
హెచ్–1బీ లబ్ధిదారుల్లో పురుషుల కంటే స్త్రీలు తక్కువే
కొత్త దరఖాస్తులకు కంపెనీలు విముఖత చూపొచ్చు
దీంతో యువతులపైనే ప్రభావం ఉండొచ్చంటున్న నిపుణులు
కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తులపై ఒకేసారి లక్ష డాలర్ల రుసుము విధిస్తున్న అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ యువ మహిళా ఔత్సాహికుల ను దెబ్బతీసే అవకాశం ఉంది. నిజానికి హెచ్–1బీ వీసా అందుకుంటున్న భారతీయుల్లో అత్యధికులు పురుషులే. 2023–24లో తమ ఉద్యోగాలను కొనసాగించడానికి (రెన్యువల్) ఆమోదం పొందిన నిపుణుల్లో 74% మంది పురుషులు, 26% మంది మహిళలు ఉన్నారు. హెచ్–1బీ కొత్త దరఖాస్తులకు (ప్రారంభ ఉపాధికి) ఆమోదం లభించిన నిపుణుల్లో మహిళల వాటా 37%.
కొత్త ‘వన్ టైమ్ రుసుము’ ప్రభావంతో నూతన దరఖాస్తుదారులు.. ముఖ్యంగా, పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలు ఉండే మహిళల అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఉద్యోగుల లేదా కార్మికుల వార్షిక జీతంలో అధిక భాగం లేదా అంతకు మించి కొత్త హెచ్–1 బీ వీసా ఫీజు ఉంది. అందువల్ల, ప్రారంభ ఉపాధి లబ్ధిదారులను స్పాన్సర్ చేయడం కంపెనీలకు ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు.
ఈ అంశం హెచ్–1బీ వీసాలు ఆశిస్తున్న ఔత్సాహికుల భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉదాహరణకు ఒక కంపెనీ కొత్త లబ్ధిదారునికి నూతన వీసా ఫీజు ప్రకారం స్పాన్సర్ చేస్తే.. మొదటి సంవత్సరంలో మొత్తం ఖర్చు.. రెన్యువల్ కోరుకునే అనుభవజ్ఞుడైన ఉద్యోగికి అయ్యే వ్యయం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం ముఖ్యంగా మహిళా లబ్ధిదారులపై ఉంటుందన్నది నిపుణుల మాట. ఎందుకంటే వారు సాధారణంగా హెచ్–1బీ హోల్డర్లలో పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
విద్యార్హతలు ఉన్నప్పటికీ..
అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం గణాంకాల ప్రకారం.. 2023–24లో హెచ్–1బీ ద్వారా కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు 75% మంది ఉన్నారు. పురుషుల విషయంలో ఇది 65%గా ఉంది. దీని అర్థం.. కెరీర్‌ను ప్రారంభించే వయసులో ఉన్న మహిళల్లో ఎక్కువ మందిని హెచ్–1బీ వీసా కొత్త ఫీజు ప్రభావితం చేయనుందని పరిశీలకులు అంటున్నారు.
2023–24లో కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 44% మంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పురుషుల విషయంలో ఇది కేవలం 39% మాత్రమే. డాక్టరేట్, ప్రొఫెషనల్ డిగ్రీ స్థాయిల్లో సైతం మహిళలదే ఆధిపత్యం. కొత్త రుసుము నూతన దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పురుషులతో పోలిస్తే ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ ఇది మహిళలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.
2023-24లో హెచ్-1బీ దరఖాస్తుల ఆమోదం
ప్రారంభ ఉపాధి దరఖాస్తు
పురుషులు 63%
మహిళలు 37%
రెన్యువల్ దరఖాస్తు
పురుషులు 74%
మహిళలు 26%

