
ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?.. దాని ఫాంట్ వేరే రకంగా కనిస్తోందా?.. అదేదో అప్‌డేట్ అనుకుని కంగారుపడేరు. ఇవాళ గూగుల్ 27వ పుట్టినరోజు. అందుకే డూడుల్ అలా దానికి విషెష్ తెలిపిందంతే. అయితే గూగుల్ ప్రారంభమైంది సెప్టెంబర్ 4వ తేదీన. అలాంటప్పుడు ఇవాళ బర్త్‌డే జరుపడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని మీకు తెలుసా?.. అసలు గూగుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా??..
గూగుల్‌ను లారీ పేజ్(Larry Page), సెర్గీ బ్రిన్(Sergey Brin) ప్రారంభించారు. 1998లో సెప్టెంబర్ 4న అధికారిక కంపెనీ గుర్తింపు దక్కించుకుంది. అయితే.. 2003 నుంచి గూగుల్ బర్త్‌డే మారిపోయింది. 2003లో సెప్టెంబర్ 8న, 2004లో సెప్టెంబర్ 7న, 2005లో సెప్టెంబర్ 26 నిర్వహించుకుంది. అయితే 2006 నుంచి సెప్టెంబర్ 27ను క్రమం తప్పకుండా తన పుట్టినరోజుగా మార్చేసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు!.

సెప్టెంబర్ 27, 2006లో గూగుల్ అరుదైన మైలురాయి దాటింది. అత్యధిక వెబ్‌పేజీలను ఇండెక్స్ చేసిన ఘనత గూగుల్ సొంతం చేసుకుంది. అంటే.. ఒక నిర్దిష్ట సమయంలో తన సెర్చ్ ఇంజిన్ ద్వారా అప్పటిదాకా ఎవరూ సాధించని ఫీట్ సాధించింది. అలా.. ఆ అరుదైన ఘనత సాధించిన సందర్భాన్ని బర్త్‌డేగా మార్చుకుంది. అప్పటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే తన పుట్టినరోజున డూడుల్స్, ప్రమోషన్స్, తన ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను ప్రకటిస్తుంటుంది.

ఇంతకీ గూగుల్ అర్థమేంటంటే..
Google అనే పదానికి అర్థం ఏ డిక్షనరీలోనూ కనిపించదు. అసలు ఆ పదానికి ఓ అర్థమంటూ లేదు కూడా. వాస్తవానికి.. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ 1997లో తాము రూపొందించిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌కు గూగోల్(Googol) అనే పేరు పెట్టాలనుకున్నారు. గూగోల్ అంటే.. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. అపారమైన సమాచారాన్ని అందిస్తుంది అనే అర్థం వచ్చేలా ఆ పదం అనుకున్నారు. అయితే..

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో వీళ్లద్దరి సహచరి విద్యార్థి సీన్ అండర్సన్.. Googol.com అనే డొమెయిన్‌కు బదులు Google.com అని టైప్ చేశాడు. అయితే లారీ పేజ్ ఆ పేరు నచ్చి.. అప్పటికప్పుడు ఆ డొమెయిన్‌ను ఫిక్స్ చేశారు. అలా ఆ తప్పిదమే చివరికి ఇప్పుడు ప్రపంచమంతా వెతుక్కునే ప్రముఖ బ్రాండ్‌గా మారింది.
ఇది తెలుసా?..
గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్‌ఫ్లెక్స్(Googleplex) అమెరికా కాలిఫోర్నియా స్టేట్ మౌంటెన్ వ్యూలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్‌లో స్టాన్(Stan) అనే డైనోసార్ బొమ్మ ఉంటుంది. గూగుల్ అనేది ఎంత పెద్ద సెర్చ్ ఇంజిన్ అయినా సరే.. డైనోసార్‌లా అంతం అయిపోకుండా, కొత్త ఆలోచనలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారట. అంతేకాదు.. 2010లో తమ ఆవరణలో ఉన్న గడ్డిని కత్తిరించేందుకు మెషీన్లు, పరికరాల సాయంతో కాకుండా అద్దెకు గొర్రెలను తెచ్చి ఇకోఫ్రెండ్లీ ఐడియాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కూడా. ఇంకో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే..


గూగుల్‌కు నెట్ ఆగిపోతే వచ్చే డైనోసార్ గేమ్ తెలుసు కదా. 2014లో ఈ ఆఫ్‌లైన్ గేమ్(T-Rex Runner-Chrome Dino) ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఇంటర్నెట్ లేకపోతే మనం డైనోసార్ యుగంలో ఉన్నాం అనే ఫన్‌తో యూజర్ల దృష్టి మరలకుండా ఉండేందుకే ఈ గేమ్‌ను క్రియేట్ చేశారట!.