
ఆహార వ్యవస్థలతో పర్యావరణ కాలుష్యం
ఏటా 15 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం
‘రెడ్‌మీట్ విభాగం’ 33% తగ్గాలి
మొక్కల నుంచి వచ్చే ఆహారం పెరగాలి
ప్రపంచంలోని సంపన్న దేశాల ఆహారపుటలవాట్లు మారితే.. చాలావరకు కాలుష్యం తగ్గిపోతుంది! చెప్పాలంటే 30 శాతం సంపన్నుల వల్ల.. 70 శాతం ఆహార సంబంధ పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి!! ప్రపంచ ప్రసిద్ధ ‘ఈఏటీ – లాన్సెట్ కమిషన్’ వెల్లడించిన వాస్తవమిది. ఇటీవలి కాలంలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ ఆహార తయారీలో వాడుతున్న రసాయనాలు, ప్లాస్టిక్స్, పురుగుమందులు.. ఇవన్నీ పెనుముప్పును తెచ్చిపెట్టనున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార వ్యవస్థలు మారకపోతే భవిష్యత్తులో మానవాళికి ఆరోగ్యకరమైన ఆహారం కలగా మారిపోతుందని హెచ్చరించింది.
ఈఏటీ – లాన్సెట్ కమిషన్‌లో.. 6 ఖండాల్లో ఉన్న అనేక దేశాల్లోని పోషకాహార, వాతావరణ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక శాస్త్రాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు సభ్యులు. ‘ఆహార ఉత్పత్తి, వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే ఉద్గారాలు.. శిలాజ ఇంధనాల కంటే ప్రమాదకరమైనవి’ – వీళ్లంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట ఇది. ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేసినా.. ప్రస్తుత ఆహార వ్యవస్థలు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పెంచగలవని వీరు హెచ్చరిస్తున్నారు. ఆహార వ్యవస్థల వల్ల ఏటా 16 – 17.7 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఇవి మొత్తం భౌగోళిక ఉద్గారాల్లో 30 శాతం!
5 లక్షల కోట్ల డాలర్లు!
ఇప్పుడున్న ఆహార వ్యవస్థలు ఇలాగే కొనసాగితే.. ఏటా 15 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని.. అనేక దేశాల శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్న ‘ఫుడ్ సిస్టమ్ ఎకనామిక్స్ కమిషన్’ అంచనా వేసింది. అదే, ఈ ఆహార వ్యవస్థలకు కొత్త రూపు ఇస్తే ఆరోగ్యకరమైన సమాజం, పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవం వంటి పరిణామాల వల్ల ఏటా 5 లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని చెబుతోంది. ఈ మార్పులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్ మీట్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, పంపిణీ వంటివి 33 శాతం తగ్గాలని తెలిపింది. పండ్లు, కూరగాయలు, గింజల ఉత్పత్తి 63 శాతానికి పెరగాలని సూచించింది. ఇందుకోసం కమిషన్ మరో 8 పరిష్కార మార్గాలనూ ప్రపంచ దేశాల ముందు ఉంచింది. ఇవన్నీ అమలు జరిగితేనే.. 2050 నాటికి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ భూమిపై ఉండే 960 కోట్ల జనాభాకూ ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపింది.
అష్ట పరిష్కారాలు
⇒ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచడం
⇒ సంప్రదాయ వంటకాలు / ఆహారాలను పరిరక్షించడం
⇒ సుస్థిర ఉత్పత్తి పద్ధతులు అమలు చేయడం
⇒అడవుల వంటి చెక్కుచెదరని పర్యావరణ వ్యవస్థలను కాపాడటం
⇒ ఆహార వృథాను అరికట్టడం
⇒ గౌరవప్రదమైన వృత్తి లేదా పని, తద్వారా గౌరవప్రదమైన సంపాదన
⇒ అణగారిన వర్గాలపై వివక్ష చూపకుండా ఉండటం
⇒ అణగారిన వర్గాల వారికి అన్ని అవకాశాలూ కల్పించడం
పీహెచ్‌డీ ఆహారం
ప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్యలకు, వాతావరణ సమస్యలకు పరిష్కారంగా ‘ప్లానెటరీ హెల్త్ డైట్ (పీహెచ్‌డీ)’ ఆహారాన్ని ఈఏటీ – లాన్సెట్ కమిషన్ సూచించింది. ఇందులో మొక్కల నుంచి వచ్చే ఆహారం పాళ్లు ఎక్కువగా, జంతువుల నుంచి వచ్చే ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. చక్కెరలు, సంతృప్త కొవ్వులు, ఉప్పు చాలా మితంగా ఉంటాయి. పీహెచ్‌డీ ఆహారం వల్ల టైప్ 2 మధుమేహం, హృద్రోగాలు, కేన్సర్ల వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్యానికీ, పర్యావరణానికీ మంచిదని రుజువైంది.
ఆహార వ్యవస్థల వల్ల వచ్చే ఉద్గారాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయంటే..
⇒ మూడో వంతు వ్యవసాయం నుంచి
⇒ మూడో వంతు భూ వినియోగ మార్పిడి ద్వారా
⇒ మూడో వంతు ప్రాసెసింగ్, రవాణా, రిటైల్ వంటి సరఫరా వ్యవస్థల వల్ల