
‘మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్’తో సూర్యరశ్మి వెనక్కు!
సముద్ర మేఘాల్లోకి జల శతఘ్నుల ప్రయోగం
చిక్కబడిన మేఘాలతో సూర్య ‘శౌర్యం’ తిరుగుముఖం
భూతాపాన్ని తగ్గించేందుకు జియో ఇంజనీరింగ్ వ్యూహం
ఐదేళ్లలో ప్రయోగాలు
సక్సెస్ అయితే భూగ్రహం ఇక చల్లని గృహమే!
ఇది కూడా యుద్ధం వంటిదే! అయితే దేశాల మధ్య యుద్ధం కాదు. శాస్త్ర పరిశోధకులు సూర్యుడిని మసకబార్చి భూమిని చల్లబరిచేందుకు చేయబోతున్న మహా ప్రయోగ సంగ్రామం! ఈ జాజ్వల్యమాన జల వ్యూహంలో సముద్రతలం నుంచి నౌకలు, గగనతలం నుంచి విమానాలు ఉప్పు నీటి శతఘ్నులను సంధించి, తమ చెయ్యెత్తులో ఉన్న సాగర మేఘాలను చిక్కబరిచి వాటిని దట్టంగా మార్చేస్తాయి. ఆ బాహుబలి మేఘాలు, సూర్యుడి నుంచి వచ్చే తీక్షణమైన కిరణాలను అడ్డుకుని, వాటిని తిరిగి వెనక్కు అంతరిక్షంలోకి పంపిస్తాయి! వేడిమి నుంచి భూమిని కాపాడతాయి. మహోష్ణ గోళంతో మనిషి తలపడనున్న ఈ ఆపరేషనే ‘ఎంసీబీ’. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్! -సాక్షి, స్పెషల్ డెస్క్
మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అనేది ఒక జియో ఇంజనీరింగ్ టెక్నిక్. భూతాపాన్ని అరికట్టే ప్రయత్నంలో, భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే పర్యావరణ ప్రక్రియలను పెద్ద ఎత్తున మార్చడమే జియో ఇంజనీరింగ్. ప్రపంచవ్యాప్తంగా, మహా సముద్రాలపై సూర్యరశ్మిని వెనక్కు పంపించేలా వాతావరణంలోకి కృత్రిమ రసాయన వాయు కణాలను చొప్పించటం, భూతాప నియంత్రణకు సముద్రపు నీటిలో కరిగి ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చి పారేయటం వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల వంటి అన్నీ జియో ఇంజినీరింగ్ వ్యూహంలో భాగమే.
ఎంసీబీ ప్రయోగాన్ని ఎలా చేస్తారు?
వాతావరణంలోకి ఉప్పు నీటిని ‘ఎగచిమ్మటం’ ద్వారా సముద్ర మేఘాలను కృత్రిమంగా అత్యంత ప్రకాశవంతం చేయటమే మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్. దీనివల్ల ఏర్పడే ఉప్పు నీటి వాయు బిందువులు సముద్ర మేఘాల సాంద్రతను పెంచుతాయి. ఆ మేఘాలను ఢీకొని సూర్యరశ్మి వెనక్కు (పైకి) మళ్లుతుంది. దాంతో భూమి సంగ్రహించే ఉష్ణోగ్రత తగ్గి, భూతాప నివారణ జరుగుతుంది. సముద్రపు మేఘాలు సహజంగా మహాసముద్రాలపై ఏర్పడతాయి.
అందుకు సముద్రపు ఉప్పు కీలకమైన పదార్థంగా పనిచేస్తుంది. సముద్రపు ఉప్పు కణాలు గాలి ద్వారా కదిలినప్పుడు అవి మేఘ బిందువులకు కేంద్రకాలుగా మారి, నీటి ఆవిరి వాటిపై ఘనీభవిస్తుంది. ఈ మేఘ బిందువుల సంఖ్య, పరిమాణం ఒక మేఘం ఎంత సూర్యరశ్మిని తిప్పి కొడుతుందో నిర్ణయిస్తాయి. ఇదంతా సహజ ప్రక్రియ. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ విధానంలో సముద్ర మేఘాలకు మరిన్ని సముద్రపు ఉప్పు కణాలను జోడించడం ద్వారా ఈ సహజ ప్రక్రియను అనుకరించడం, మెరుగుపరచడం జరుగుతుంది. మెరైన్ స్నో మెషీన్లను, ప్రత్యేకమైన నాళాల వంటి పరికరాలను ఉపయోగించి సముద్రపు ఉప్పు నీటిని గాలిలోకి చల్లడం ద్వారా ఈ ప్రయోగం చేస్తారు.
35 ఏళ్ల ప్రయత్నాలు.. 5ఏళ్లలో ప్రయోగాలు!
1990లలో తొలిసారి బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త జాన్ లాథమ్‌కు ఈ ‘మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్’ ఆలోచన వచ్చింది. ప్రయోగాలకు అనుకూలమైన సముద్ర ప్రాంతాలపై మేఘాలను ప్రకాశవంతం చేయడం వల్ల భూతాపాన్ని పెరగకుండా చేయవచ్చని ఆయన తలపోశారు. ఎలాగంటే... ప్రత్యేక స్ప్రేయర్‌లతో వాతావరణంలోకి చిన్నపాటి సముద్రపు నీటి బిందువులను ఎగజిమ్ముతారు. ఇవి ఆవిరైపోయి ఉప్పు కణాలను మిగులుస్తాయి. ఆ కణాలు దట్టమైన, ప్రకాశవంతమైన మేఘాలను సృష్టిస్తాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకుని భూమి మీద వాటి తీవ్రతను తగ్గిస్తాయి. ఇదీ జాన్ లాథమ్ ఆలోచన. ఇన్నేళ్లకు ఈ ఆలోచన ప్రయోగ దశకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రయోగం ఆచరణలోకి రావచ్చని ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్న ‘ఆరియా‘ అనే బ్రిటన్ సంస్థ అంచనా వేస్తోంది.
రహస్య పరిశోధనా సంస్థ ‘ఆరియా’
భూతాప వేగాన్ని నెమ్మదిపరిచే లక్ష్యంతో అనేకమైన జియో ఇంజనీరింగ్ ప్రాజెక్టు పనులు చేపట్టటానికి ‘అరియా’ అడ్వాన్డ్ రీసెర్చ్ ఇన్వెషన్ ఏజెన్సీ’ ఏర్పాటైంది. ఇందుకోసం ఈ ప్రభుత్వ రహస్య పరిశోధనా సంస్థ ఇంతవరకు ప్రజా పన్నుల నుంచి 800 మిలియన్ పౌండ్లను సమకూర్చుకుంది. ఇందులో ఒక్క మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్టుకే 57 మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. అనధికారికంగా 2021 ఫిబ్రవరిలో, అధికారికంగా 2023 జనవరిలో ఈ సంస్థ ప్రారంభం అయింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను ఆవిష్కరించమే తన ధ్యేయం అని ఈ సంస్థ చెబుతోంది. ‘‘ఎంతో ఊహాజనితమైన, అతి కష్టతరమైన, వేరే చోట జరగటం అసంభవం అయిన పరిశోధనలను కొనసాగించడానికి మేము శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అధికారం ఇస్తాం’’ అని అరియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇలాన్ గుర్ అంటున్నారు.

ఎంసీబీ ప్రయోజనాలు
⇒ మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ భూమి గ్రహించే సూర్యరశ్మి పరిమాణాన్ని తగ్గించి భూతాపాన్ని నివారిస్తుంది.
⇒ భూగోళాన్ని చల్లబరిచి వేడిగాలులు లేకుండా, కరువు కాటకాలు రాకుండా చేయగలదు.
⇒సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను తగ్గించి, పగడపు దిబ్బలు క్షీణించకుండా కాపాడుతుంది.
ఎంసీబీ దుష్ప్రభావాలు
⇒ వాతావరణ సమతౌల్యం, భూమికి నీటిని అందించే ‘అవపాత చక్రం’ (వర్షపు జల్లులు, మంచు, వడగళ్లు కురిసే కుదురైన వ్యవస్థ) దెబ్బతినే ప్రమాదం ఉంది.
⇒ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను నియంత్రించే ‘ఎల్ నినో’ గతి తప్పవచ్చు.
⇒ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు నిష్ఫలం కావచ్చు.