
ఊహా చిత్రం
ఫేక్ ఐడీలతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను బెదిరించి రూ.1.07 కోట్లు వసూలు
హైదరాబాద్‌లో కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తాజాగా వారి ఉచ్చులో టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పడ్డారు. ఫేక్ ఐడీలతో బెదిరించి భారీ స్థాయిలో దోచుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనట్లు వెబ్ మీడియా ద్వారా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. ముంబై సైబర్‌క్రైమ్ అధికారులుగా నటించిన మోసగాళ్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను మనుషుల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామంటూ బెదిరించి ఆయన నుంచి డబ్బులు గుంజారు.
ప్రొవిజనల్ బెయిల్ పేరుతో రూ.1.07 కోట్లను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న ఎమ్మెల్యే పుట్టాకు అక్టోబరు 10 ఉదయం 7.30 గంటలకు ఫోన్ కాల్ వచి్చంది. ఫోన్ చేసిన వ్యక్తి తను ముంబై సైబర్ క్రైమ్ విభాగం అధికారిగా పరిచయం చేసుకున్నారు. ఆపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, 17 ఫిర్యాదులు కూడా అందాయని చెప్పాడు. ఆధార్, సిమ్‌కార్డు వాడి నకిలీ బ్యాంకు ఖాతా కూడా తెరిచారని, ముంబైలో కొనుగోలు చేసిన సిమ్ కార్డు ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు చెప్పాడు.
కొద్ది నిమిషాలకు మరో వ్యక్తి వాట్సాప్ వీడియా కాల్‌లోకి వచ్చాడు. తాను సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారి అని చెప్పి నకిలీ అరెస్టు వారెంట్, సీబీఐ అకౌంట్ ఫ్రీజ్ ఆర్డర్ చూపించి నమ్మించినట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే తన ఖాతాకు ఎక్కడి నుంచి డబ్బులు వచి్చందని అవతలి వ్యక్తిని ప్రశ్నించారు. కెనరా బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు డిపాజిట్ అయ్యాయని, వాటిని తిరిగి ఇచ్చేలా సహకరించకపోతే అరెస్టు చేస్తామని మోసగాళ్లు బెదిరించినట్లు తెలుస్తోంది.
అనంతరం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అక్టోబర్ 15లోపు రూ.1.07 కోట్లు సైబర్ మోసగాళ్ల అకౌంట్‌కు పంపించినట్లు సమాచారం. కాగా, మరో రూ.60లక్షలు పంపిస్తే కోర్టు క్లియరెన్స్ సర్టిఫికెట్ పంపిస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే, గురువారం రాత్రి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.