
రోడ్డు ప్రమాదాల్లో 1.74 లక్షల మంది దుర్మరణం
దేశంలో ప్రమాదాల్లో 4.44 లక్షల మంది మృతి
సగానికిపైగా దుర్ఘటనలకు అతివేగమే కారణం
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటలు డేంజర్
2023వ సంవత్సర నివేదికలో ఎన్‌సీఆర్‌బీ వెల్లడి
దేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో 4.44 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాల
వంటి ‘ట్రాఫిక్ ప్రమాదాల్లో’ 1.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగమే. ఇలా మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే జరిగాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2023లో 6,444 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 69,809 మంది ప్రమాదాల్లో మరణించగా, ఆ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (43,320), ఉత్తరప్రదేశ్ (43,207) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 19,949 ప్రమాదాల్లో 17,039 మరణించగా, తెలంగాణలో 22,903 ప్రమాదాల్లో 13,374 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్రాఫిక్ మరణాలు..: రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు.. వీటిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ‘ట్రాఫిక్ మరణాల’ కింద పరిగణించారు. 2019లో ఇలా 1.81 లక్షల మంది మరణిస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 1.98 లక్షలకు పెరిగింది. తెలంగాణలో 23,673 ట్రాఫిక్ ప్రమాదాల్లో 8,345 మంది మరణించగా.. ఏపీలో 21,078 కేసుల్లో 9,284 మంది ప్రాణాలు కోల్పోయారు.
టూ వీలర్లే అత్యధికం
మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. కారు, జీపు, ఎస్‌యూవీల వల్ల 14.3 శాతం జరగ్గా.. ఆటోల వంటి త్రీవీలర్ల వల్ల 4.1 శాతం సంభవించాయి.

అతివేగం అనర్థదాయకం
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పరిమితికి మించిన వేగంతో వెళ్లడమే. ఇలా 58.6 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఓవర్ టేకింగ్ వంటి వాటివల్ల 23.6 శాతం యాక్సిడెంట్లు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 2.1 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 60.2 శాతం (2.80 లక్షల కేసులు) గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కాగా.. 39.8 శాతం
(1.84 లక్షలు) పట్టణాల్లో జరిగాయి.
రాత్రిపూటే అధికం
మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం (95,984) సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే సంభవించాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 17.3 శాతం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు 15 శాతం సంభవించాయి.