
యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌లోని ఖైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున స్పార్కియో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతులను ఏపీకి చెందిన డీఎస్పీ శాంతారావు, మేక చక్రధర్‌గా గుర్తించారు. వీరు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నట్టు సమాచారం. ఇక, వాహనం ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.