
జెన్ జీ, మిలేనియల్స్‌లో పెరుగుతున్న రుణాలు
అందుబాటులో ఎన్‌బీఎఫ్‌సీలు, లోన్ యాప్‌లు
కొనేముందు 3 ప్రశ్నలు వేసుకుంటే మంచిది
అప్పు భవిష్యత్తుకు ముప్పు అంటున్న నిపుణులు
‘అప్పు’డే తెల్లారిందా.. పాత సినిమాలో ఒక డైలాగ్. మిలేనియల్స్ (1981–96 మధ్య పుట్టినవారు).. జెన్ జీ (1997–2012 మధ్య జన్మించినవారు).. పరిస్థితి ఇలాగే ఉంది. అనవసరా లు, విలాసాల కోసం విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు. లోన్‌యాప్‌లు.. సులభ వాయిదాలు.. వారిని ‘ఈజీగా’ అప్పుల బాట పట్టేలా చేస్తున్నాయి. ‘అప్పు చేయడం రోగం.. తీర్చకపోవడం ప్రమాదకరం అనేది గుర్తించకపోతే సమస్యలు తప్పవు’ అంటున్నారు నిపుణులు.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ‘ట్రాన్స్ యూనియన్ సిబిల్’ ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్న వారు (యునిక్ ఇండివిడ్యువల్ బారోవర్స్) 28 కోట్ల మంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం.. వ్యక్తిగత రుణాలు లేదా వ్యాపారం కోసం లేదా ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకునేవారి సంఖ్యతోపాటు, తీసుకునే మొత్తం కూడా పెరిగింది. 2018 మార్చి నాటికి తలసరి రుణం రూ.3.41 లక్షలు ఉంటే 2023 మార్చికి రూ.3.8 లక్షలకు, 2025 మార్చి నాటికి రూ.4.77 లక్షలకు పెరిగింది.
కనీసం 3 రుణాలతో..
ఫిన్‌టెక్ సంస్థల వంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) చిన్నచిన్న మొత్తాల్లో ఇచ్చే రుణాలను జెన్ జీ, మిలేనియల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. రూ.50వేల కంటే తక్కువ రుణాల్లో.. ఈ సంస్థలు ఇచ్చినవే 84.3 శాతం. ముఖ్యంగా ఇలా రుణం తీసుకుంటున్నవారిలో సుమారు 10 శాతం మంది సమయానికి చెల్లించడం లేదట. మరీ ముఖ్యంగా.. గత త్రైమాసికంలో ఇలా రుణం తీసుకున్నవారిలో 66 శాతానికిపైగా అప్పటికే కనీసం 3 రుణాలు తీసుకుని ఉన్నారని ఆర్బీఐ చెబుతోంది.
అనవసర ఖర్చులకు 29 శాతం
‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్స్ టెక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ పర్ఫియోస్ ఇటీవల ఒక నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని, వారు చేసే ఖర్చులను పరిశీలించింది.
⇒ ప్రజలు చేసే మొత్తం వ్యయంలో హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు చేసేది 29 శాతం ఉంటోంది. ఈ ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్‌కు చేస్తున్నారు.
⇒ తప్పనిసరి ఖర్చులకు చేసే వ్యయం 39% కాగా, అవసరాలకు 32% ఖర్చు చేస్తున్నారు.
⇒ అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.
ఈఎంఐ.. ఆదాయాన్ని మింగేస్తూ
నెల వాయిదాలు (ఈఎంఐలు).. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ, దీర్ఘకాలంలో ప్రమాదకరమైనవి. ఎప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలీదు. – ఇందులోని మరో ముఖ్యమైన విషయం. ఈఎంఐల మాటున ఉండే వడ్డీ.
⇒ ఒకేసారి చెల్లించకుండా భవిష్యత్తులో చెల్లించడం వల్ల.. భవిష్యత్తు లక్ష్యాలు, ఖర్చులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
⇒ ఉద్యోగం పోయినా.. తక్కువ జీతం వచ్చే ఉద్యోగా నికి మారినా.. ఏదైనా అనారోగ్య సమస్యలాంటిది వచ్చి ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినా.. ఈఎంఐలు గుదిబండలా మారతాయి. ఒకటికి మించి ఈఎంఐలు ఉంటే ప్రతినెలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.
జీరో కాస్ట్ ఈఎంఐ
చాలామంది ‘జీరో కాస్ట్ ఈఎంఐ’ ఉందిగా అని ఈ మధ్య విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. పేరుకే జీరోకానీ, ఇది కూడా ఖరీదైనదే.
⇒ చాలా సందర్భాల్లో ఆయా కంపెనీలు / వేదికలు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి.
⇒ ఈ లావాదేవీ జరిగిన తరువాత.. ఒకవేళ మనకు ఏదో విధంగా డబ్బు చేతికి అంది ఆ అప్పు తీర్చేద్దామంటే కుదరదు. ముందస్తు చెల్లింపులమీద చార్జీ ఉంటుంది.
⇒ మామూలు ఈఎంఐలానే, ఏదైనా ఒక్క నెలలో చెల్లింపు చేయలేకపోయినా.. ఆలస్యంగా చేసినా.. మొత్తం బకాయిపై వడ్డీ చెల్లించాలి. అలాగే ఆ రుణం తీసుకున్నప్పటి నుంచి జరిపే అలాంటి అన్ని లావాదేవీలపైనా వడ్డీ చెల్లించాలి. ఇలాంటి రకరకాల చార్జీల భారం పడుతుంది.
⇒ ఆలస్యంగా చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్‌పైనా ప్రభావం పడుతుంది.
ఏమిటి పరిష్కారం?
ఏది కొనాలని అనిపించినా.. ఒక 10 నిమిషాల పాటు ఆలోచించాలి. మూడు ప్రశ్నలు వేసుకోవాలి.
⇒ ఇది అత్యవసరమా? లేక విలాసం కోసం కొంటున్నానా?
⇒ దీనిపై చేస్తున్న ఖర్చు నెలవారీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది?
⇒ ఇది లేకుండా నేను ఉండలేనా?
ఈ ప్రశ్నలకు మీ మనసు చెప్పే సమాధానాలతో మీరు సంతృప్తి చెందాక కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోండి.
⇒ వస్తువుల్లో కాకుండా మనుషుల్లో.. అనుబంధాలు, ఆప్యాయతలు, స్నేహాలలో ఆనందాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టండి. అంతిమంగా.. అప్పు లేదా ఈఎంఐలు మీ జీవితాన్ని శాసించకుండా చూసుకోండి. ఆనందం, విలాసం కావాల్సిందే.. కానీ, దాని కోసం మీ ఆర్థిక హద్దులు దాటకండి.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఇతరులను చూసి నిర్ణయాలు తీసుకోకండి.
ఈఎంఐ.. తత్వం అర్థమై..
ఈఎంఐల తత్వం తెలిసిన వాళ్లు వీటికి కొత్త రూపాలు ఇచ్చారు. అవి..
⇒ ఎండింగ్ మై ఇన్‌కమ్ లేదా ఎంప్టీయింగ్ మై ఇన్‌కమ్ లేదా
⇒ ఈటింగ్ మై ఇన్‌కమ్ (నా ఆదాయాన్ని తినేస్తోంది)
⇒ ఎవ్రీ మంత్ అయామ్ బ్రోక్ (ప్రతినెలా నన్ను ఏడిపిస్తోంది)
⇒ ఎక్స్‌క్యూజ్ మై ఇగ్నోరెన్స్ (నా అజ్ఞానాన్ని మన్నించు)
⇒ ఎండ్‌లెస్ మంత్లీ ఇన్‌కన్వీనియన్స్ (అంతులేని నెలవారీ అసౌకర్యం)
⇒ ఎవ్రీ మంత్ ఇంటరప్టెడ్ (ప్రతినెలా అంతరాయం)
⇒ ఎవ్రీ మంత్ ఇన్ డెటెడ్ (ప్రతినెలా అప్పులు)