
‘కాళేశ్వరం’ రుణ బకాయిలపై సర్కారుకు ఆర్‌ఈసీ లేఖ
లేకుంటే రుణాలు నిరర్థక ఆస్తులుగా మారతాయని వెల్లడి
గడువుకు 75–85 రోజుల తర్వాత చెల్లింపులతో జరిమానా, వడ్డీల భారం తప్పవని స్పష్టీకరణ
రాష్ట్ర రుణపరపతి, క్రెడిట్ రేటింగ్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిక
రుణాల పునర్వ్యవస్థీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్), తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్) పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించిన రూ. 1,393.65 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ ఈసీ) కోరింది. గడువులోగా బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కా వడంతో ఈ నెల 6న ఆర్‌ఈసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జతీన్‌కుమార్ నాయక్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు లేఖ రాశారు.
ఈ లేఖను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం మీడియా కు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,393.65 కోట్ల బకాయిల్లో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీ, కేఐపీసీఎల్‌కి సంబంధించి వరుసగా రూ. 319.75 కోట్లు, రూ. 292.75 కోట్లు గత 68 రోజులుగా మొండిబకాయిలుగా మారాయని, వాటిని వరుసగా ఈ నెల 28, 29 తేదీల్లోగా చెల్లించకుంటే ఇరు సంస్థల రుణాలూ నిరర్థక ఆస్తులుగా మారిపోతాయని ఆర్‌ఈసీ పేర్కొంది. రుణాల చెల్లింపుల్లో ఈ తరహా జాప్యం వల్ల ఇరు సంస్థలతోపాటు స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వ రుణ పరపతిపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని.. రేటింగ్ పడిపోతోందని హెచ్చరించింది.
మే 31 నాటికి టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్, కేఐపీసీఎల్‌కి సంబంధించి వరుసగా రూ. 10,278 కోట్లు, రూ. 17,232 కోట్ల రుణాల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని లేఖలో ఆర్‌ఈసీ గుర్తుచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేఐపీసీఎల్‌కు రూ. 30,536 కోట్ల రుణాన్ని, దేవాదుల, సీతారామ, కంతనపల్లి తదితర ప్రాజెక్టుల నిర్మాణానికి టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌కి రూ. 13,517 కోట్ల రుణాలు కలిపి మొత్తం రూ. 44,053 కోట్ల రుణాలను ఆర్‌ఈసీ మంజూరు చేసినప్పటికీ అందులో కేఐపీసీఎల్‌కు రూ. 19,448 కోట్లు, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్‌కు రూ. 12,618 కోట్లు కలిపి మొత్తం రూ. 28,995 కోట్లను మాత్రమే విడుదల చేసింది.
ఈ రు ణాలను గడువులోగా తిరిగి చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విఫలమవుతోందని పేర్కొంటూ గతేడాది నవంబర్ 5న సైతం ఆర్‌ఈసీ లేఖ రాసింది. రుణాలను గడువుకు 75–85 రోజుల తర్వాత చెల్లిస్తుండటంతో ప్రభుత్వంపై జరిమానా, వడ్డీల భారం పడుతోందని గుర్తుచేసింది.
రుణాల పునర్వ్యవస్థీకరణ కుదరదు..
కేఐపీసీఎల్‌తోపాటు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు వ్యవధిని పెంచడంతోపాటు వడ్డీలను తగ్గించడం ద్వారా వాటిని పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆర్‌ఈసీ తిరస్కరించింది. రుణాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రుణాల గడువును 2039–40 నాటికి పొడిగించాలని కోరుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
2030 నాటికి 9 శాతం, 2035 నాటికి 18 శాతం, 2036 నాటికి 27 శాతం, 2040 నాటికి 46 శాతం రుణాలను తిరిగి చెల్లించేలా గడువులను పొడిగించాలని కోరింది. అయితే అది కుదరదని గతేడాది నవంబర్ 5న రాసిన లేఖలో ఆర్‌ఈసీ తేల్చిచెప్పింది. రూ. 30 వేల కోట్ల ఆర్‌ఈసీ రుణాల్లో 71 శాతాన్ని 2029–30 నాటికి.. మిగిలిన 29 శాతాన్ని 2035 నాటికి చెల్లించాల్సి ఉంది.