
గతేడాది కంటే 17% అధికం... ఎస్‌ఎల్‌బీసీ నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెంపు, గ్రామీణ ఆర్థికశక్తి వృద్ధికి పెద్దపీట వేస్తూ బ్యాంకులు లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో రూ.7,65,000 కోట్ల రుణా లు ఇవ్వాలని నిర్ణయించాయి. గత ఏడాది (2024–25)లో రూ.6.51 లక్షల కోట్ల లక్ష్యానికి గాను అదనంగా మరో లక్ష కోట్లు ఎక్కువగా రూ.7.52 లక్షల కోట్ల రుణాలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. గురువారం జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) వార్షిక నివేదికలో ఈ మేరకు గత ఏడాది లక్ష్యాలను చేరుకున్న తీరు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏఏ రంగాలకు ఎన్ని వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలనే లక్ష్యాలను ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ రాజేశ్‌కుమార్ వెల్లడించారు.
వ్యవసాయ రంగం
2024–25లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లకుగాను రూ.1.37 లక్షల కోట్లు మంజూరు చేశారు. పంట రుణాల్లో 80.5% మేర పురోగతి సాధించగా, వ్యవసాయ ఆధారిత ఇతర రంగాల్లో 104.8% సాధించారు. 27.53 లక్షల రైతులకు రూ.33,245 కోట్ల విలువైన కేసీసీ (కిసాన్ క్రెడిట్ కార్డు) రుణాలు ఇచ్చారు.
ఎంఎస్‌ఎంఈ రంగం
ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణ లక్ష్యం రూ.1.29 లక్షల కోట్లు కాగా, రూ.1.21 లక్షల కోట్ల రుణాలను ఆయా బ్యాంకులు ఇచ్చాయి. అంటే 93.6% లక్ష్యాన్ని సాధించాయి. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల విభాగాల్లో రుణాల ప్రవాహం పెరుగుతోందని ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది.
ఇతర రంగాల్లో బలహీన పురోగతి
విద్యారుణాల్లో కేవలం 21.43 శాతం మాత్రమే లక్ష్యాలను చేరుకున్నాయి. 2024–25లో విద్యారుణాలను రూ.2707 కోట్లు మేర ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.580 కోట్లు మాత్రమే అందజేశారు. గృహ రుణాల్లో 31.87 శాతం మాత్రమే లక్ష్యాలను చేరుకున్నట్టు ఎస్‌ఎల్‌బీసీ నివేదిక తెలిపింది. రూ.10,769 కోట్ల గృహ రుణాలు లక్ష్యం కాగా, కేవలం రూ.3432 కోట్లు మాత్రమే ఇచ్చారు.
2025–26 లక్ష్యాలు ఇవీ...
తాజా ప్రణాళిక ప్రకారం 2025–26లో రూ.7.65 లక్షల కోట్లు రుణాల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1.65 లక్షల కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.1.45 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. విద్యా రుణాలకు రూ.3200 కోట్లు, గృహరుణాలకు రూ.11,500 కోట్లు కేటాయించారు. విద్యా, గృహరుణాల్లో తక్కువ లక్ష్య సాధన కనబడగా, ఎంఎస్‌ఎంఇలు, వ్యవసాయరంగాల్లో బ్యాంకులు రుణాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేలింది. కాగా బ్యాంకు రుణాలకు సంబంధించిన సిఫార్సులల్లో గ్రామీణ ప్రాంతాల్లో నిర్భంధ బ్యాంకు కరెస్పాండెంట్లను (బీసీలు) అమలు చేయాల్సి ఉంది. అన్ని కేసీసీ ఖాతాలకు ఆధార్ లింక్ చేయడంతో పాటు ఎస్‌హెచ్‌జీ సభ్యులకు బీమా పథకాలను విస్తరించాలని నివేదిక స్పష్టం చేసింది.