వర్కింగ్‌ మదర్‌.. ఎంతో ప్రెజర్‌! | severe pressure due to working women trapped between work and household chores and children | Sakshi
Sakshi News home page

వర్కింగ్‌ మదర్‌.. ఎంతో ప్రెజర్‌!

Sep 7 2025 5:23 AM | Updated on Sep 7 2025 5:23 AM

severe pressure due to working women trapped between work and household chores and children

ఇంటా, బయటా నలిగిపోతున్న మహిళలు.. ఇల్లు, పిల్లలు ఉద్యోగంతో తీవ్రమైన ఒత్తిడి

‘మగాళ్లు అర్థం చేసుకుంటే అదే పదివేలు’.. గుర్తింపు, గౌరవం ఇస్తే చాలంటున్న అతివలు

ఒక భానుతేజ...
‘మెటర్నిటీ లీవ్‌ తర్వాత పాలు తాగే పాపను ఇంట్లో వదిలి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్‌కి వెళ్తుంటే అనుభవించిన బాధ ఎవరికీ అర్థంకాదు. లిఫ్ట్‌దాకా పాపను ఎత్తుకుని లిఫ్ట్‌ లోకి ఎక్కుతున్న ప్పుడు పాపను అత్తయ్య తీసుకుంటుంటే అది నా చున్నీ పట్టుకుని వెళ్లకుండా మొండికేస్తుంటే ఏడుపొ చ్చేది. బలవంతంగా పాపను అత్తయ్య చేతిలో పెట్టి వచ్చేసేదాన్ని’ అంటూ గుర్తుచేసుకుంది భానుతేజ. 

ఆమె ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇప్పుడు ఆమె కూతురికి మూడేళ్లు. ఆ  పాపను డే కేర్‌ సెంటర్‌లో చేర్చింది. అయినా భానుతేజ బాధ, భయం పోలేదు. ఉదయం తొమ్మిదింటికి తాను ఆఫీస్‌కి వెళ్లేప్పుడు పాపను డే కేర్‌లో దింపితే.. సాయంత్రం ఏడింటికి తాను ఇంటికి వస్తూ పాపను తీసుకెళ్తుంది. పాపకు కావల్సిన పాలు, భోజనం, స్నాక్స్, డైపర్స్‌ అన్నీ ఇస్తుంది. అయినా ఏదో తెలియని ఆందోళన. ఆఫీసులో ఉన్నా పాప గురించే ఆలోచన!

ఏ ఉద్యోగికైనా నిర్దిష్టమైన పనిగంటలు ఉంటాయి. అలాంటి వెసులుబాటు లేని అలుపెరుగని సేవ అమ్మది! ఆమె ఉద్యోగి కూడా అయితే.. ఆకష్టం మామూలుది కాదు! ఇల్లు, పిల్లలు, కెరీర్‌.. వీటన్నింటితో వర్కింగ్‌ మదర్స్‌ నలిగిపోతుంటారు. మరి, అలాంటి మహిళలకు పరిష్కారం ఏమిటి? కుటుంబం.. ముఖ్యంగా భర్తలు లేదా ఇంట్లోని మగవాళ్లు వాళ్లకు చేదోడుగా ఎలా ఉండొచ్చు?

ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువులు చదివి, ఉద్యోగాలు చేసే అతివలు కొందరు. తమకు నచ్చిన లేదా ప్రావీణ్యం ఉన్న పనిని చేయాలన్న లక్ష్యంతో కెరీర్‌ ఎంచుకునే మహిళామణులు మరికొందరు. రోజురోజుకీ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వేణ్నీళ్లకు చన్నీల్లలా ఇంటి బండి నడవడానికి సాయపడదామని ఏదో ఒక పనిచేసే పడతులు ఇంకొందరు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు.. 
ఇలా విభిన్న రంగాల్లో ఇంటా బయటా రెండు అవతారాలు ఎత్తి పనిచేసే మహిళలు ఎందరో.

శత సహస్రావధానం
అమ్మాయిల చదువు, ఉద్యోగాల విషయంలో ఇంటి నుంచి ఎంత ప్రోత్సాహం దొరుకుతున్నా.. పిల్లలు పుట్టగానే ‘పిల్లలా.. కెరీరా?’ అనే డైలమా. రెండిట్లో ఏదో ఒకదాన్నే 
ఎంచుకోవాల్సిన పరిస్థితి. మొండిగా రెండిటినీ ఎంచుకుంటే.. ఇంటా బయటా చాలా సందర్భాల్లో మద్దతు లేమి లాంటి ఒత్తిళ్లు! ‘కానీ, మగవాళ్ల విషయంలో అలా కాదు. భార్య ఉద్యోగం ఎంత గొప్పదైనా.. ఆమె తనకన్నా రెట్టింపు జీతం తీసుకుంటున్నా సరే.. పిల్లల కోసం కొలువుకి సంబంధించి నో కాంప్రమైజ్‌. వర్కింగ్‌ మదర్‌కి మాత్రం సర్దుబాట్లు తప్పవు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇలా ఇల్లు, పిల్లలు, ఉద్యోగం మధ్య సమన్వయ మనే అష్టావధానం.. కాదు కాదు, శత సహస్రావధానం, ఒక్క భానుతేజదే కాదు.. కడుపులో చల్ల కదలకుండా చేసుకునే టీచర్‌ ఉద్యోగం నుంచి 24/7 ఆన్‌టాస్క్‌ ఉండే ఆంత్రొ ప్రెన్యూర్‌ వరకు వర్కింగ్‌ మదర్స్‌ అందరిదీ!

పోనీ పిల్లల్ని వాయిదా వేసుకుంటే..
ఇదివరకటిలా పిల్లల కోసం ఇప్పుడు బయ లాజికల్‌ క్లాక్‌ను ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎగ్‌ ఫ్రీజింగ్, ఆంబ్రియో ఫ్రీజింగ్, సరోగసీ లాంటి.. సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సహాయంతో కెరీర్‌లోనే కాదు.. ఆర్థికంగానే స్థిరపడ్డాకే పిల్లల్ని కనే వెసులుబాటు ఉంది. కానీ ఆ ప్రక్రియల్లో సక్సెస్‌ రేట్‌ లెక్కేసుకోవాలి. అంతవరకు, జీవనశైలి జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. ‘ఆ తలనొప్పి కంటే.. వయసులో పిల్లలను కనడమే బెటర్‌’ అంటున్నారు చాలామంది వర్కింగ్‌ ఉమన్‌.

మరి పరిష్కారం?
వర్కింగ్‌ మదర్స్‌కి ఇటు ఉద్యోగం.. అటు పిల్లల పెంపకం మధ్య నలగకుండా.. అపరాధ భావానికి గురవకుండా రెండిటినీ వీలయినంత వరకు సమన్వ యం చేసుకోగల సహకారం కావాలి. 
నెలల వయసు నుంచి స్కూల్‌ ఈడు వచ్చేవరకు పిల్లల సంరక్షణ కోసం అన్ని సంస్థలు క్రషెస్, డే కేర్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల వర్కింగ్‌ మదర్స్‌కు మాన సిక ప్రశాంతత, రిలీఫ్‌ ఉండటమే కాక పిల్లల కోసం సెలవులు, ముందస్తు అనుమ తులు లాంటి పనివేళల వృథా తగ్గుతుంది అంటున్నారు భిన్నరంగాల్లోని  వర్కింగ్‌ మదర్స్‌. 
⇒ చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఇలాంటి కన్వీనియెన్స్‌ ఉన్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు సహా మిగిలిన అన్ని రంగాల్లోనూ ఏర్పాటైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వారు  వ్యక్తం చేస్తున్నారు.

‘మగాళ్లూ.. కాస్త ఆలోచించండి’
⇒ ‘ఉద్యోగం పురుష లక్షణమే. కానీ, మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న మమ్మల్ని కూడా గుర్తించండి, గౌరవించండి’ అని కోరుతున్నారు మహిళలు.
⇒  ‘చిన్నచూపు చూడటం, సూటిపోటి మాటలు లేకపోతే మా పని మేం హాయిగా చేసుకుంటాం. కుటుంబంలోనూ సంతోషం వెల్లివిరుస్తుంది’ అంటున్నారు.
⇒     ‘పిల్లల చదువులు, ఇంటి పనులు, తమపై ఆధారపడినవారు ఉంటే వారి కష్టసుఖాలు, సింగిల్‌ మదర్‌ అయితే అదనపు బాధ్యతలు.. ఇలా పది చేతులున్నా సరిపోనన్ని పనులు. మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటే మాకు పదివేలు’ అని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement