
పిల్లల్లో 10 శాతం మంది ఊబకాయులే!
అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారమే ప్రధాన కారణం
2035 నాటికి ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం
యునిసెఫ్ ప్రపంచవ్యాప్త సర్వే – 2025
పిల్లల్లో ఊబకాయ సమస్య ప్రపంచానికి పెద్ద ఆరోగ్య సంక్షోభంలా పరిణమించబోతోందని యునిసెఫ్ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా బాలల్లో 10 శాతం మంది ఊబకాయంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఊబకాయం ఉంటోందని పేర్కొంది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటు పడటమే ఇందుకు కారణం అని చెబుతూ, ఈ అలవాట్లు పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్యాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
‘తగినంత ఆహారం లేక గతంలో పిల్లలు తరచూ బరువు తక్కువగా ఉండేవారు. అది వారి శారీరక పెరుగుదలను కుంగదీయడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకూ దారితీసింది. అయితే, తాజా పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జంక్‌ఫుడ్‌ను తినకుండా ఉండలేక పిల్లలు బరువెక్కుతున్నారు’ అని యునిసెఫ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.
ఇదీ పోషకాహార లోపమే!
నేటి పిల్లల్లో ఊబకాయం అన్నది, మునుపటి దశాబ్దాల నాటి పోషకాహార లోపం కంటే వేగంగా పెరుగుతోందని, ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య.. బరువు తక్కువగా ఉన్నవారిని మించిపోయిందని నివేదిక తెలిపింది. బాల్యంలోని ఈ ఊబకాయం ఇప్పుడు పోషకాహార ‘లోపానికి’ వేరొక రూపంగా భావించవచ్చని పేర్కొంది.
యునిసెఫ్, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 18 కోట్ల 80 లక్షల మంది పిల్లలు ఊబకాయుల కేటగిరీలో ఉన్నారు! ఈ వయసులో బరువు తక్కువగా ఉన్న పిల్లల శాతం 2000లో 13 నుంచి నేడు 9.2 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఊబకాయం 3 శాతం నుంచి 9.4 శాతానికి పెరిగింది.
ఎక్కడ ఎక్కువగా ఉన్నారు?
యునిసెఫ్ నివేదిక ప్రకారం పసిఫిక్ దీవులలోని పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. దీవి దేశాలైన నియులో 38 శాతం, కుక్ దీవులలో 37 శాతం, నౌరు దీవులలో 33 శాతం బాల ఊబకాయులు ఉన్నారు. ప్రపంచంలో మొత్తం బాల్య, కౌమార దశల్లో ఉన్న వారిలో 42.7 కోట్ల మంది అధిక బరువు సమస్యతో ఉంటే వారిలో.. దాదాపు సగం మంది తూర్పు ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరీబియన్, దక్షిణాసియాలలోనే ఉన్నారు.
అలవాటుగా అధిక ఆహారం
ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో కనిపిస్తున్న ఈ ఊబకాయానికి ప్రధాన కారణం.. చవకైన, మితిమీరి ప్రాసెస్ చేసిన, దిగుమతి చేసుకుంటున్న అధిక కేలరీల ఆహార పదార్థాల వినియోగం పెరగడమేనని నివేదిక గుర్తించింది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారని తెలిపింది. అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారంలో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు వంటివి చిన్నారుల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయని పేర్కొంది.
పేద దేశాల్లోనూ ఊబకాయం
సాధారణంగా అధిక ఆదాయ దేశాలలో పిల్లలు ఊబకాయంతో ఉంటారని ఒకప్పుడు భావించేవారు. అయితే, యునిసెఫ్ తాజా నివేదిక ఈ భావనను పటాపంచలు చేసింది. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో చిలీలో 27 శాతం మంది, యూఎస్‌ఏ, యూఏఈలలో 21 శాతం మంది ఊబకాయంతో ఉండటాన్ని బట్టి పిల్లల్లోని ఈ ఊబకాయం దిగువ, మధ్య ఆదాయ దేశాలకే పరిమితం కాలేదని నివేదిక గుర్తించింది.
ప్రకటనలు ప్రేరేపిస్తున్నాయి
పిల్లల్లో ఊబకాయం పెరగడంలో వ్యాపార ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది. తాజా సర్వేలో, గతవారం 13 నుంచి 24 సంవత్సరాల వయసు గల 75 శాతం మంది పిల్లలు, యువకులు జంక్ ఫుడ్ ప్రకటనలను చూసినట్లు వెల్లడైంది. వారిలో 60 శాతం మంది ఈ ప్రకటనలు చూశాక తమలో వాటిని తినాలన్న కోరిక కలిగిందని తెలిపారు. ఘర్షణలు, యుద్ధ వాతావరణం ఉండే ప్రాంతాల్లోనూ 68 శాతం యువత ఇప్పటికీ అలాంటి మార్కెటింగ్ వ్యూహాలకు ప్రభావితం అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఆర్థిక ముప్పు!
ఈ ఊబకాయం ముప్పును తప్పించటానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యునిసెఫ్ హెచ్చరించింది. 2035 నాటికి, ఊబకాయం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే భారం రూ.353 లక్షల కోట్లకు చేరుతుందని యునిసెఫ్ అంచనా వేసింది. పర్యవసానంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, ఉత్పాదక రంగం అన్నీ దెబ్బతింటాయని హెచ్చరించింది.