ప్లీజ్ నాన్న.. చంపొద్దు.. | Prakasm Children Incident | Sakshi
Sakshi News home page

ప్లీజ్ నాన్న.. చంపొద్దు..

Sep 4 2025 1:15 PM | Updated on Sep 4 2025 2:09 PM

 Prakasm Children Incident

నాగర్‌కర్నూల్‌ జిల్లా: తెలంగాణలో దారుణం జరిగింది. నాగర్కర్నూల్జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లల్ని చంపి ఆపై తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు

 భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన వ్యక్తి మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామశివారులో వెలుగుచూసింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు (36) ఫర్టిలైజర్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. గతనెల 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవపడ్డాడు. 

ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు మోక్షిత (8), రఘువర్షిణి (6), శివధర్మ (4) పాఠశాల నుంచి ఇంటికి రాగానే.. ద్విచక్ర వాహనంపై వారిని ఎక్కించుకొని బయలుదేరాడు. వారంతా శ్రీశైలం మీదుగా తమ ప్రయాణాన్ని సాగించారు.  చివరకు నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌ శివారులో హైదరాబాద్‌–శ్రీశైలం రహదారి పక్కనున్న వ్యవసాయం పొలంలో వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకంటే ముందే తన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీశాడు. పొలంలో వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని వెల్దండ ఎస్‌ఐ కురుమూర్తి పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బైక్‌ నంబర్‌ ఆధారంగా వివరాల గుర్తింపు..
ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతడి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామశివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడ ఉన్న బైక్‌ నంబర్‌ ఆధారంగా ఇక్కడి పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు, అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. అక్కడ పిల్లలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.

శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ రోడ్డులో వారు ప్రయాణించినట్లు తెలుసుకొని మార్గమధ్యంలోని పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీశైలం–హైదరాబాద్‌ మార్గంలోని అజీపూర్‌ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు గుర్తించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోనేటీపూర్‌ టోల్‌ప్లాజా వద్ద మాత్రం పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడని పోలీసులు నిర్ధారించారు. మిగిలిన మరో కూతురు, కుమారుడు కనిపించకపోవడంపై విచారణ చేస్తున్నారు. వెల్దండ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ.. పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు పిల్లల ఆచూకీ మిస్టరీగా మారింది. మృతుడి తమ్ముడు మల్లికార్జున్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement