
డబ్బుల కోసం వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య
ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడని భర్తను చంపాలనుకున్నదో భార్య. మొదటిసారి విఫలం కావడంతో రెండోసారి మద్యంలో బీపీ, నిద్రమాత్రలు పొడిచేసి కలిపి తాగించింది. అపస్మారస్థితిలోకి వెళ్లాక ఉరేసి చంపేసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలితో పాటు ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్‌లో గురువారం సీపీ గౌస్‌ఆలం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
నగరంలోని సప్తగిరికాలనీలో నివాసముంటున్న కత్తి మౌనిక, సురేశ్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మౌనిక ఇటీవల సెక్స్‌వర్కర్‌గా మారింది. సురేశ్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన బంధువులైన అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య ఊరాఫ్ వేముల రాధ, నల్ల దేవదాస్ సాయం కోరింది. వారి సూచనల మేరకు ఒకరోజు వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించగా, వాసన రావడంతో సురేశ్ తినలేదు. గతనెల 17న సురేశ్ మద్యం సేవిస్తుండగా బీపీ, నిద్ర మాత్రలు పొడిగాచేసి మద్యంలో కలపడంతో అది తాగిన సురేశ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.
సురేశ్ మెడకు చీరను బిగించి, కిటికి గ్రిల్‌కు వేలాడదీసి ఉరేసి చంపేసింది. తర్వాత లైంగిక చర్య సమయంలో స్పృహ కోల్పోయాడని తన అత్తమామలకు చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సురేశ్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మౌనిక ప్రవర్తనపై నిఘా పెట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆమెను విచారించగా తానే అరిగెశ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి ఆజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్ సాయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్‌ను సీపీ అభినందించారు.