
ప్రజావాణిలో భార్య, భర్త పరస్పర ఫిర్యాదులు
కరీంనగర్ అర్బన్: ఓ దంపతుల ఫిర్యాదు ప్రజావాణిలో కలకలం రేపింది. తన భూమి చెరువు నీటితో మునిగిపోయిందని, తన కుమారునికి ఉద్యోగం కల్పించాలని భార్య ఫిర్యాదు చేయగా.. తనను మోసం చేసి, తాను చనిపోయినట్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసి భార్య వితంతు పింఛన్ పొందుతోందని భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కంగుతిన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పిల్లి భారతి–రాజమౌళి దంపతులు.
కొన్నాళ్లుగా ఎవరికి వారుగా జీవనం సాగిస్తున్నారు. కాగా, సోమవారం జరిగిన ప్రజావాణికి భారతి అర్జీతో వచ్చింది. గతంలో కలెక్టర్ తనకు ఉద్యోగమిచ్చారని, ఆరోగ్యం బాగులేకపోవడం వల్ల చేయలేకపోయానని, సదరు ఉద్యోగాన్ని తన కుమారునికి ఇప్పించాలని ఆడిటోరియంలోకి వస్తూనే బైఠాయించింది. దీంతో పోలీసులు రంగప్రవే«శం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే భారతి ఎపిసోడ్ ముగియగానే రాజమౌళి ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశాడు.
తాను బతికుండగానే మరణించినట్లు ధ్రువీకరణపత్రం తీసుకుని భార్య వితంతు పింఛన్ పొందుతోందని కన్నీటిపర్యంతమయ్యాడు. పోచంపల్లి గ్రామంలో పదెకరాల భూమి ఉండగా 2016లో సదరు భూమిని మరణ ధ్రువపత్రం ఆధారంగా ఆమె పేరిట భూ బదలాయింపు చేశారని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. కాగా ఇరువురి ఫిర్యాదులపై క్షేత్రస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.