
ఆఖరి లేఖలో భార్యాపిల్లలను కోరిన అభాగ్యుడు
సిరిసిల్లలో విగ్రహాల తయారీదారుడి ఆత్మహత్య
సిరిసిల్ల: ‘మీ అమ్మకి ఏమీ తెలియదు. చాలా అమాయకురాలు. ఇక నన్ను క్షమించండి. నేను చేసిన అప్పులతో నా భార్యాపిల్లలకు ఏం సంబంధం లేదు. వారికి ఎలాంటి హానీ తలపెట్టవద్దు. నా భార్యాపిల్లలకు మనవి.. మీకు ఇబ్బందిగా ఉంటే.. నాతోపాటే మీరు కూడా రాగలరు. జిల్లా కలెక్టర్ గారు.. ఎస్పీ గారు.. నా భార్యాపిల్లలకు న్యాయం చేయండి.. నేను బిజినెస్‌లో నష్టపోయి.. అప్పులోళ్లకు మొహం చూపించలేక సచ్చిపోతున్నా... అప్పులోళ్లు ఇద్దరే చాలా వేధించారు..’ అని సూసైడ్ నోట్ రాసి చనిపోయిన సంఘటన సిరిసిల్లలో సంచలనంగా మారింది. కరీంనగర్ శివారులోని ఎలగందులకు చెందిన విక్కుర్తి శేఖర్(48) ఇరువై ఏళ్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. స్థానిక మొదటి బైపాస్‌రోడ్డులో గణపతి విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తుంటారు.
వ్యాపారంలో నష్టాలు రావడం.. అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక సోమవారం విగ్రహాలను తయారు చేసే షెడ్డులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్లకు చెందిన బాలసాని అంజయ్యగౌడ్ తన ప్లాటు(స్థలం) కాగితాలను బెదిరించి లాక్కున్నారని, బాలసాని యాదయ్య ఇల్లును ఆక్రమించుకోవాలని చూస్తున్నారని లేఖలో శేఖర్ పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన ఇతరులు ఏమీ అనలేదని, మూడేళ్లు సమయం ఇచ్చారని, వాళ్లంతా నన్ను క్షమించాలని లేఖలో వేడుకున్నారు. వాళ్లకు మొఖం చూపించలేకపోతున్నానని పేర్కొన్నారు. షెడ్డు ఓనర్ తన భార్యపిల్లలకు సహకరించాలని కోరారు.
కలెక్టర్, ఎస్పీలకు లేఖ
తన ఆస్తి భార్య పిల్లలకు దక్కేలా చూడాలని, కల్లు సొసైటీలో సభ్యత్వం పిల్లలకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కోరారు. మృతుడికి భార్య వసుధ, పిల్లలు అఖిల్, మణిదీప్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.