
పెళ్లి చేసుకోవాలని వేధింపులు
నిరాకరిస్తే హత్య చేయించింది
మృతుడు చిరంజీవి కుటుంబ సభ్యులు
న్యాయం చేయాలని వేడుకోలు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ప్రేమిస్తున్నానని చెప్పి రూ.10లక్షలు, ప్లాట్, బంగారం తీసుకుంది.. పెళ్లి చేసుకోవాలని వేధించింది.. అంగీకరించకపోవడంతో చివరకు చంపించిందని ఈనెల 10న సెంటినరీకాలనీలో హత్యకు గురైన కోట చిరంజీవి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు.
స్థానిక ప్రెస్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మృతుడు చిరంజీవి సోదరులు రామ్‌చరణ్, సాయిచరణ్‌తోపాటు బావమరిది నరేశ్ మాట్లాడారు. చిరంజీవికి ఇంటర్‌లో క్లాస్‌మేట్ సంధ్యారాణి అని, మీసేవ కేంద్రానికి వచ్చి ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకునేదన్నారు. ప్రేమిస్తున్నాని చెప్పి దాదాపు రూ.10లక్షల నగదు, 5 తులాల బంగారం, ఒక ప్లాట్ తీసుకుందని తెలిపారు. వివాహం చేసుకోవాలని వేధించిందని, ఇద్దరు పిల్లలతోపాటు ఇద్దరు పెళ్లి కాని సోదరులున్నారని, వివాహం చేసుకోనని తిరస్కరించాడని వివరించారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతోనే పగ పెంచుకొని పథకం ప్రకారంగా హత్య చేయించినట్లు అనుమానముందని ఆరోపించారు. వీరి ప్రేమ వ్యవహారంలో వీర్లపల్లిలో గతంలోనూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు గుర్తు చేశారు. చిరంజీవి మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే వీడియోలు, మెసేజ్‌లు, డబ్బుల సమాచారముంటుందని, సీసీ కెమెరాలు పరిశీలించాలన్నారు. దీనివెనక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లు అనుమానముందని, పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నాగరాజు, శ్రీజ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.